నల్లగొండ జిల్లాలో రూ.61.50 లక్షల రైతుబంధు చెక్కుల స్కాం

by  |
Asp Narmada
X

దిశ, నల్లగొండ : జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కేసులు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద వివరాలు వెల్లడించారు.

2018 మే నెలలో రైతు బంధు పథకం కింది అందజేసిన రూ.4 వేల చెక్కులను జిల్లాలోని గుర్రంపోడు, పెద్ద అడిశర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, చండూరు మండలాల్లో అధికారులు దళారులతో కుమ్మకై కాజేశారు. రైతులకు పంపిణీ చేసిన చెక్కుల్లో చనిపోయిన వారివి, భూ వివరాలు తప్పుగా పడిన వారివి, ఇతర ప్రాంతాల్లో ఉంటూ చెక్కులు తీసుకోని రైతుల చెక్కులను కొందరు రెవెన్యూ అధికారులు, దళారులు, బ్యాంకు అధికారులతో కలిసి కుమ్మక్కయ్యారు. వారంతా కలిసి అక్రమంగా 547 చెక్కుల ద్వారా రూ. రూ.61.50 లక్షల నగదును కాజేసి రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐదు మండలాల్లో ఐదు క్రిమినల్ కేసులను నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె వివరించారు.

ఈ కేసు విచారణలో సమర్ధవంతంగా పని చేసిన దేవరకొండ, నల్లగొండ డీఎస్పీలు ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మల్లేపల్లి, నాంపల్లి, చండూర్ సీఐలు రవీందర్, సత్యం, మధు, గుర్రంపోడు, గుడిపల్లి, నాంపల్లి, చింతపల్లి ఎస్ఐలు శీనయ్య, వీరబాబు, రఫీ, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు.


Next Story