సింగరేణి బాధిత కుటుంబానికి రూ.20లక్షల ఆర్థికసాయం

by  |
సింగరేణి బాధిత కుటుంబానికి రూ.20లక్షల ఆర్థికసాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆడపిల్లల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నా.. అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, సింగరేణికాలనీలో చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. సైదాబాద్ లోని సింగరేణికాలనీలో బాధిత కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. ప్రభుత్వం తరుపున రూ.20 లక్షల చెక్ ను కుటుంబ సభ్యులకు అందజేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లల విద్యాబాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కుటుంబానికి చిన్నారి లేని లోటు తీర్చలేమన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణకు సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వారిపట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని వెల్లడించారు. మంత్రులతో పాటు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, ఇతర అధికారులున్నారు.



Next Story