ఆ పేరుతోనే రూ. 1500 కోట్ల భారీ మోసం

by  |
ఆ పేరుతోనే రూ. 1500 కోట్ల భారీ మోసం
X

దిశ, క్రైమ్ బ్యూరో : మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని సభ్యులుగా చేర్పించి దాదాపు రూ.1500 కోట్ల భారీ మోసానికి పాల్పడిన ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ శనివారం తెలిపారు. సంస్థ సీఈఓ సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశామని, చైర్మన్‌ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టయినవారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వారి భార్యలు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఉపాధ్యాయులు తమ విధులకు సెలవు తీసుకొని మరీ ఈ మోసాలకు పాల్పడ్డట్లు సీపీ వివరించారు. ఈ తరహాలో ఎంత మంది ప్రభుత్వోద్యోగులు సెలవు పెట్టి ఈ స్కీంలో భాగస్వామిగా ఉన్నారో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బెంగళూరు కేంద్రంగా..

ఆమ్‌వే మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో కొన్నాళ్లు పనిచేసిన బెంగుళూరుకు చెందిన అభిలాష్ థామస్ (40) ఇండస్ వివా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పేరుతో మనీ సర్క్యూలేషన్ స్కీంకు 2014 లో ప్రారంభించాడు. ఈ స్కీంలో ముందుగా రూ. 12,500 కట్టి సభ్యులుగా చేరితే పలు రకాల హెల్త్ ప్రొడక్ట్స్‌ను అందజేస్తారు. ఆ తర్వాత ఇద్దర్నీ.. ఆ ఇద్దరు మరో ఇద్దర్నీ చేర్పించేలా మల్టీ లెవల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ పద్ధతిని అనుసరించి ఒక్కొక్క సభ్యుడి నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. బెంగుళూరు కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ స్కీం దాదాపు దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉంది. ఈ స్కీంలో రూ.1000 నుంచి మొదలు.. 9 వారాల్లో ఎడమ వైపు 256, కుడివైపు 256 మందిని సభ్యులుగా చేర్పిస్తే.. రూ.2.56 లక్షల వరకూ కమీషన్ పొందే అవకాశం ఉంటోందని చెప్పారు. ఐ పల్స్ ప్రొడక్ట్ వినియోగిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతారని, ఐ స్లిమ్ వాడితే లావుగా ఉన్నవారు సన్నబడతారని చెప్పి నమ్మించారు.

ఇండస్ వివా కంపెనీ ప్రత్యేక బ్రోచర్‌లో కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ థామస్ ఐజాక్‌లతో కలిసి దిగిన ఫోటోలు వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. పలు రాష్ట్రాలలో ఖరీదైన హోటళ్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ అమాయకులను నమ్మిస్తూ దందాకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్ మైండ్ స్పేస్ సమీంలోని ఓ ఖరీదైన హోటల్ లో 11 గదులను అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ తరహా స్కీంలను ప్రజలెవరూ నమ్మవద్దంటూ సూచించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులకు సజ్జనార్ రివార్డులు అందజేశారు.

Next Story

Most Viewed