పాపం… రూట్ మార్చి వెళ్తోన్న మంత్రి!!

by  |
పాపం… రూట్ మార్చి వెళ్తోన్న మంత్రి!!
X

ఆయనో మంత్రి.. తలచుకుంటే తన ప్రాంతంలో సమస్యలన్నీ ఇట్టే పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైనా మంజూరు చేయించుకోవచ్చు. తను ఉండే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాస ప్రాంతంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆయనతోపాటు ప్రజలూ నిత్యం మురుగుతో నానా ఇక్కట్లు పడుతున్నారు. నిత్యం అదే రోడ్లపై వస్తూ పోతున్న మంత్రిగారు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. రోడ్లు మోరీలను తలపిస్తున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఏండ్ల నాటి పైపులైన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. దీంతో తరచూ పగిలి పూడుకుపోతున్నాయి. రోడ్లపైనే మురుగు పారుతోంది. మారేడ్ పల్లిలోని హోంశాంతి హోటల్ ముందు, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్లే దారిలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఇంటికి రోజుకు వందల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, ప్రజలు వెళ్తుంటారు. ఈ దారిలో పది హేను రోజులుగా మురుగు ఏరులై పారుతోంది. అయినా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

మురుగు బాధ తప్పదా..?

వర్షాలు తగ్గినా నగరవాసులను మురుగు సమస్య వదలడం లేదు. కోర్ సిటీ, పాతబస్తీ ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వచ్చే 30 ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్ రెడీ చేయడానికే వాటర్ బోర్డు దాదాపు రూ.10కోట్లకు పైగా ఖర్చు చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ సర్కారు సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను ప్రచారాస్త్రంగా మార్చుకుం ది. డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తాం.. అద్భుతమైన సీవరేజీ మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తాం అన్నారే కానీ అది అమలు కాలేదు. ఎన్నికల ముందు చెప్పడం తర్వాత పట్టించుకోకపోవడం రివాజుగా మారింది. టీఆర్ఎస్ సర్కారు కూడా ఆ దిశగా ఎన్నో హామీలు ఇచ్చినా చర్యలు లేవు.

అటకెక్కిన మాస్టర్ ప్లాన్..

కోర్ సిటీలోని 6 జోన్లు, ఓఆర్ఆర్ లోని గ్రామాలు, మున్సిపాలిటీతో కలిపి 2,245చదరపు కిలో మీటర్ల మేర సీవరేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం అనుకుంది. ప్రస్తుతం ఉన్న కోటీన్నర జనాభా డబుల్ అయినా సీవరేజీ నిర్వహణ సులభమయ్యేలా ప్రాణాళికను అధికార యంత్రాంగం రూపొందించింది. భవిష్యత్ తరాల అవసరాల మేరకు 3వేల ఎంఎల్డీ మురుగును శుద్ధి చేసే కెపాసిటీతో 58ఎస్టీపీలను నిర్మించాలనుకుంది. అయితే వీటన్నింటిని అమలు చేసేందుకు రూ.5వేల కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉండడంతో రూ.10కోట్లు ఖర్చు చేసి రూపొందించిన మాస్టర్ ప్లాన్ నూ అటకెక్కించింది. మ్యాన్ హోళ్లను క్లీన్ చేసేందుకు జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. ఇప్పటికే మంత్రి తలసాని ఇంటి సమీపంలో జెట్టింగ్ యంత్రాలతో మ్యాన్ హోళ్లను క్లీన్ చేసినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు.

Next Story

Most Viewed