సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..

by  |
rahul
X

న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతోపాటు బుధవారం గ్యాస్ సిలిండర్ల ధరలూ పెరగిన నేపథ్యంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ దోపిడీకి వ్యతిరేకంగా దేశం ఏకమవుతున్నదని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్న 2014లో రూ.410గానే గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.885కు పెరిగిందని వెల్లడించారు. ఏడేళ్లలో ఏకంగా 116శాతం ధర పెంచేశారని మండిపడ్డారు. అలాగే, 2014లో లీటరు పెట్రోలు ధర రూ.71.5గా ఉండగా, ఇప్పుడది 42శాతం పెరిగి రూ.101కు ఎగిసిందని చెప్పారు.

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగాయని కొందరు వాదించవచ్చని, కానీ, యూపీఏ హయాంలో ఈ ధరలు ప్రస్తుతానికంటే ఎక్కువగా ఉండేవని తెలిపారు. అంతకుముందు ఆయన పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ప్రజలు ఖాళీ కడుపుతో నిద్రించేలా ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తి.. తాను మాత్రం స్నేహితుల నీడలో హాయిగా సేదతీరుతున్నారు. ఈ అన్యాయంపై పోరాడేందుకు దేశం ఏకమవుతున్నది’ అని వెల్లడించారు.

జీడీపీ పెరగడమంటే ఇదే..
‘‘జీడీపీ పెరుగుతుందంటూ ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తరచూ చెప్తుంటారు. అయితే, జీడీపీ అంటే ‘గ్రాస్ డెమొస్టిక్ ప్రొడక్ట్’ కాదని నాకు తర్వాత తెలిసింది. జీడీపీ పెరగడమంటే ‘గ్యాస్-డీజిల్-పెట్రోల్’ ధరలు పెరగడమని అర్థమైంది’’ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed