నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం

by  |
నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం
X

ప్రతి ఒక్కరూ తమ పనుల కోసం రెవెన్యూ కార్యాలయం గడప తొక్కాల్సిందే. ప్రభుత్వ పనితీరుకు ఆ శాఖ ఉద్యోగుల సేవలే ప్రామాణికం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఉద్యోగ సంఘాల నాయకుల మితిమీరిన జోక్యం కారణంగా ఆ శాఖ ఉద్యోగుల ఎంపిక, కారుణ్య నియామకాలలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ప్రతి శాఖలో ఉద్యోగుల ఎంపిక, నియామకా నికి కచ్చితమైన సర్వీసు నిబంధనలు ఉన్నాయి. ఒక్క రెవెన్యూ శాఖలోనే కారుణ్య నియామకాల పేరిట అర్హతలు లేకున్నా ఉద్యోగాలు కట్టబెడుతున్నారని అంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కారుణ్య నియామకాలకు రెవెన్యూ శాఖ పునరావాస కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వెయ్యి కండ్లతో సర్కారు ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతోదని రెవెన్యూ శాఖలోని నిజాయితీ కలిగిన అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులు చేసిన యువత ఎన్నో ఏండ్లుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వారికి అవకాశం లేకుండా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను అనర్హులతో నింపేయడంతో వారికి అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినా వారికే పదోన్నతులు కల్పించారు. వారి విద్యార్హత పత్రాలను, వారసత్వ ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తే అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ ఉద్యోగులే చెబుతున్నారు.

పదోన్నతులకు ముందుగానే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తే కొంతయినా నిరుద్యోగ యువతకు మేలు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న వీఆర్వో, వీఆర్ఏల్లో 90% కారుణ్య నియామకాలు, బ్యాన్ పీరియడ్‌లో నియమితులైనవారేనన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరేమో మైనారిటీ తీరక ముందు లేదా వయసు మీరి అనర్హులైనవారు. వీరంతా కనీస విషయ పరిజ్ఞానం లేనివారు. దాదాపుగా 80% మంది పది, ఏడో తరగతిలోపు చదివినవారు లేదా నిరక్ష్యరాసులు. యథేచ్ఛగా చేసిన అక్రమ నియామకాల వల్ల ఈరోజు వ్యవస్థ ఇలా దిగజారిందని నిపుణులు చెబుతున్నారు. కనీసం 20% మంది భవిష్యత్తులో డీటీ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ వ్యవస్థ ఎలా బాగుపడుతుందన్న సందేహాలు కలుగుతున్నాయి. ఉన్నత విద్యావంతులెందరో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

ఇదీ సంగతి…

హన్మకొండ, వరంగల్ మండలాలలో ఇద్దరు మైనార్టీ తీరకుండానే వీఆర్ఏలుగా కారుణ్య నియామకాలు పొందారు. తర్వాత వీఆర్వోలుగా పదోన్నతులు పొందారు. నేటికీ విధులు నిర్వర్తిస్తున్నా రు. ఆత్మకూరు మండలంలో మద్యానికి బానిసైన ఓ వీఆర్వో రెండేండ్లుగా విధులకు గైర్హాజరవుతున్నారు. ఆయన స్థానంలో భార్య విధులకు హాజరవుతున్నారు. గీసుకొండ మండలంలో గతంలో ఓ ఉద్యోగి వాచ్‌మన్‌గా ఉండగానే వారి కుమారుడికి సంగెం మండలంలో వీఆర్ఏగా కారుణ్య నియామకం ఇచ్చారు. ఇప్పుడతను వీఆర్వోగా పదోన్నతి పొందారు. పర్వతగిరి మండలంలో ఓ వీఆర్వో చాలా రోజులుగా విధులకు రావడం లేదు. ఆయన స్థానంలో పెళ్లయిన కూతురు విధులు నిర్వహిస్తున్నారు.

దత్తత ద్వారా వచ్చిన సంతానానికి కారుణ్య పోస్టులు ఇవ్వకూడదు. గీసుకొండ మండలంలో గ్రామ సేవకుడిగా పని చేసిన ఓ వ్యక్తి తన తమ్ముడి మనవడు తప్పుడు పత్రాలతో వీఆర్ఏగా నియామకమయ్యారు. ఆ తర్వాత వీఆర్వోగా పదోన్నతి పొందారు. వరంగల్ మండలంలో ఒకరు వీఆర్ఏగా కారుణ్య నియామకం పొందారు. పదోన్నతి పొంది వర్ధన్నపేట మండలంలో వీఆర్వోగా పని చేస్తున్నప్పుడు గిరిజన రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత సెమీ అర్బన్ మండలానికి బదిలీపై వచ్చారు. అక్కడా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరిట రైతుల నుంచి రూ.లక్షల్లో గుంజినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదు నెలల పాటు విధులకు గైర్హాజరయ్యారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

నిబంధనలు కాదని…

నిషేధిత కాలంలో అక్రమ పద్ధతిలో వీఆర్ఏలుగా నియమితులైనవారికి పదోన్నతులకు చట్టం 2/1994ను అనుసరించి పక్కన పెట్టాల్సి ఉంది. కానీ, వారు కూడా వీఆర్వోలుగా పదోన్నతులు పొందారు. సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జాబితాలో స్థానం పొందారు. ఒకరు వీఆర్వోల సంఘ నాయకుడిగా చెలామణి అవుతున్నారు. ఆయన సోదరుడికి సైతం కారుణ్య నియామకం ఇప్పించారు. ఒక సెమీ అర్బన్ మండలంలో దురుసు ప్రవర్తనతో సస్పెండైన వీఆర్వో రికార్డుల ప్రక్షాళనలోనూ భారీగా వసూలు చేశారు. కొన్ని నెలల పాటు విధులకు గైర్హాజరైన ఇద్దరు వీఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండానే సాధారణ వేతనం చెల్లించారు. ప్రస్తుతం పదోన్నతుల జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయని అంటున్నారు. 45 ఏండ్లు దాటిన వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా వీఆర్ఏగా నియమించడంలో ఓ నాయబ్ తహసీల్దార్ కీలక పాత్ర పోషించారు.

ఉన్నత విద్యావంతులు…

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యావంతులు పెద్ద ఉద్యోగాలు దొరకక పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్నారు. కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వీఆర్ఏల్లో చాలా మంది కనీసం విషయ అవగాహన లేదు. సాంకేతిక సామర్థ్యం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలు, వీఆర్ఏలు మాత్రమే క్షేత్రస్థాయిలో పని చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ప్రతి మండలంలో 20 శాతం మంది వీఆర్వోలకు రాయడం, చదవడం రాదని సమాచారం. 50 శాతం మంది నిరక్ష్యరాసులే. కొన్ని మండలాల్లో నాలెడ్జ్ లేని తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు రిటైర్డ్ అధికారులకు అనధికారికంగా డబ్బులు చెల్లించి వారిని ప్రైవేటుగా నియమించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.



Next Story

Most Viewed