కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ షురూ

340

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​పార్టీలో మార్పులకు ముహూర్తం కుదిరింది. జిల్లా కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుల మార్పునకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు 13 జిల్లాల అధ్యక్షులను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా ఉండటం, అసంతృప్తి నేతలతో అంటకాగడం వంటి వారిపై వేటు వేయనున్నట్లు సమాచారం. గతేడాదిలో చేపట్టిన దళిత, గిరిజన దండోరా సందర్భంగానే అన్ని జిల్లాల నేతలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పార్టీ కార్యక్రమాలను జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలో సక్సెస్​ చేయాలని, అవే నేతల పనితీరుకు నిదర్శనంగా ఉంటాయంటూ టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సూచించారు. అయినప్పటికీ కొంతమంది నేతలు వాటిని పట్టించుకోలేదు. అలాంటి వారిని జిల్లా అధ్యక్షుల స్థానం నుంచి మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వన్​ టూ వన్​చర్చ

కరోనా నుంచి కోలుకున్న రేవంత్​రెడ్డి.. సోమవారం గాంధీభవన్‌లో కీలక సమావేశాలు నిర్వహించారు. టీపీసీసీ నియామకం తర్వాత తొలిసారిగా 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఒకేసారి అందరితో కాకుండా.. ఒక్కో జిల్లా అధ్యక్షుడితో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతల వైఖరిని నివేదిక రూపంలో వారి ముందించినట్లు సమాచారం. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు, జిల్లా అధ్యక్షులుగా వారు చేసిన ప్రయత్నాలు, కార్యక్రమాలు విజయవంతం అయ్యాయా, ఫెయిల్​ అయ్యాయా అనే అంశాలన్నింటినీ చర్చించారు. వన్ టూ వన్​దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడారు. ఈ కార్యక్రమాల నిర్వహణతో పాటుగా పార్టీలో అసంతృప్తి నేతలు, వారితో జిల్లా అధ్యక్షులకు ఉన్న సంబంధాలపై కూడా రేవంత్​రెడ్డి ఆరా తీశారు. వారి ద్వారానే వివరణ అడిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనితో పాటుగా ఆయా జిల్లాల వారీగా పార్టీ నేతల్లో ఉన్న సయోధ్య, నేతల మధ్య వైరం వంటి అంశాలన్నీ ప్రస్తావించారు.

13 జిల్లాల అధ్యక్షుల మార్పు..!

రాష్ట్రంలో 13 జిల్లాల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులను మార్చనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఆయా సందర్భాల్లో వ్యతిరేకస్వరం వినిపించడం, నేతలపై దాడులు చేయడం, పార్టీ సమావేశాల్లో వ్యతిరేక నినాదాలు చేయడం, సీనియర్లపై దాడులకు పాల్పడటం వంటి సంఘటనలకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకుంటారని పార్టీ నేతలు చెప్పుతున్నారు. ప్రధానంగా రేవంత్​రెడ్డి టీపీసీసీ చీఫ్ తర్వాత ఆ వర్గంతో సయోధ్యగా లేని జిల్లా అధ్యక్షులను టార్గెట్​ చేసినట్లు సమాచారం. కానీ పనితీరు బాగాలేదనే కారణంగా 13 జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సోమవారం వన్​టూ వన్​సమావేశంలో మార్పులకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తిస్థాయిలో చేయలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా కేంద్రాలు నియోజకవర్గాలు ఉన్న వారిని ఇంచార్జీలుగా ప్రకటించింది. వారిని పార్టీ అధ్యక్షులుగా కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు వారిలో కొంతమందిని మార్చి, కొత్తగా అధ్యక్షులుగా ప్రకటించేందుకు టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులను మార్చితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వారినే కొనసాగించనున్నారు. దీంతో పార్టీలో కొంత ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు.