గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంపై ఈ యేడాది నుంచే పరిశోధనలు

by  |
గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంపై ఈ యేడాది నుంచే పరిశోధనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెట్టే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ప్రత్యామ్నాయ ఇంధన వనరును తెరపైకి తీసుకొచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావటం వల్ల పర్యావరణంలోని కాలుష్యాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న పెట్రోలు, డీజిల్ వల్ల వాతావరణంలో కార్బన్ వాయువు అధిక మొత్తంలో వెలువడుతున్నాయి. అదే కోవలో ఇప్పుడు వినియోగిస్తున్న శిలాజ ఇంధనాల నుంచి వెలువడే గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ లు ఉన్నాయి. అదే గ్రీన్ హైడ్రోజన్ మాత్రం ఎలాంటి హానికర కారకాలు విడుదల చేయవని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ మాదిరిగా హైడ్రోజన్ కూడా శక్తి వాహకం, విద్యుత్తు వినియోగించే చాలా చోట్ల గ్రీన్ హైడ్రోజన్ ను వినియోగించవచ్చని చెబుతున్నారు. దీని వినియోగంతో వాతావరణ పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.

పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రకటించారు. ఈ యేడాది నుంచే ఈ మిషన్ ను ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ను కేటాయించినట్లు తెలిపారు. దీంతో దేశంలోని వివిధ ప్రయోగశాలల్లో దీనిపై పరిశోధనలు మొదలవనున్నాయి. అయితే గ్రీన్ హైడ్రోజన్ ను పునరుత్పాదక ఇంధన వనరులైన సోలార్ – విండ్(పవన) విద్యుత్తు ద్వారా నీటిలోకి ఎలక్ట్రోసిస్ ను పంపి హైడ్రోజన్ ను తయారు చేస్తారు. ఇలా చేసిన ఇంధనంతో ఎలాంటి హానికారకమైన వాయువులు ఉత్పత్తి జరగవు. దీనిపై జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఇటలీ దేశాలలో ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయి. అయితే పూర్తిస్థాయి పరిశోధన కేంద్రం మాత్రం జపాన్ లో గతేడాది మార్చి లో ప్రారంభమైంది. ప్రధాని ప్రకటనతో ఇకపై మన దేశంలోనూ గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు ఊపందుకోనున్నాయి. అయితే 2050 వరకు దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం తీసుకోనుంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ రేట్లు రోజు రోజుకూ పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది. అయితే గ్రీన్ హైడ్రోజన్ ను మరింత చౌకగా అందించే విధంగా చర్యలు తీసుకుంటే దేశంలో ఈ-వాహనాల సంఖ్య పెరిగి ఆశించినమేర కాలుష్యాన్ని నివారించవచ్చంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed