ఎంగేజ్​మెంట్​ తరువాత పెండ్లికి నిరాకరించిన వ్యక్తికి రిమాండ్​

by  |
ఎంగేజ్​మెంట్​ తరువాత పెండ్లికి నిరాకరించిన వ్యక్తికి రిమాండ్​
X

దిశ, కూకట్​పల్లి: ఎంగేజ్​మెంట్​ జరిగిన తరువాత మరింత కట్నం ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని మోసానికి పాల్పడిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని శనివారం రిమాండ్​కు కేపీహెచ్​బీ పోలీసులు తరలించారు. కర్నూల్​ జిల్లా కోయిల్​కుంట్ల సౌదరదిన్నే ప్రాంతానికి చెందిన యారాసి సౌమ్య (29) కుటుంబం గత కొన్ని ఏండ్ల నుంచి కేపీహెచ్​బీకాలనీ రోడ్డు నంబర్​ 2లోని ఎస్దా అహ్లాద రెసిడెన్సిలో నివాసం ఉంటున్నారు. సౌమ్య తండ్రి శ్రీనివాస్​ రెడ్డి కొన్ని ఏండ్ల క్రితం మృతి చెందారు. ఇదిలా ఉండగా ఈఎన్​టీ డాక్టర్​గా పని చేస్తున్న యారాసి సౌమ్య కోసం ఆమె తల్లి వివాహ సంబంధాలు చూసే క్రమంలో తెలుగు మ్యాట్రిమోనిలో కేపీహెచ్​బీకాలనీ రోడ్డు నంబర్​ 3లో నివాసం ఉంటున్న కెనెరా బ్యాంక్​ మేనేజర్​ దుబ్బా మనోజ్​ కుమార్​ రెడ్డి(30) సంబంధం కుదిరింది.ః

దీంతో జూన్​ 6వ తేదిన ఎంగేజ్​మెంట్​ జరిగింది. ఈ క్రమంలో దుబ్బా మనోజ్​ కుమార్​ రెడ్డికి కట్నం కింద 5 ఎకరాల భూమి, 25 లక్షల విలువ గల ప్లాట్​, 40 గులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు కట్నం కింద ఇవ్వడానికి ఒప్పకున్నారు. ఈ క్రమంలో సౌమ్య కుటుంబ సభ్యులు మనోజ్​ కుమార్​ రెడ్డికి 50 వేల రూపాయలు వస్త్రాలు కొనుగోలుకు అందజేశారు. అంతే కాకుండా మనోజ్​ పుట్టినరోజు సందర్భంగా సౌమ్య జూన్​ 24న పది వేల రూపాయాల ఖరీదైన వాచి బహుమతిగా ఇచ్చింది. ఇదిలా ఉండగా సౌమ్య కుటుంబ సభ్యులు పెండ్లి పనులలో బిజీగా ఉంటూ 25వ తేదిన మనోజ్​ కుమార్​ తల్లి తండ్రులు చంద్రారెడ్డి, లలితమ్మ ఫోన్​ చేసి తమ కొడుకు పెండ్లి సౌమ్యతో చేయడానికి ఇష్టంగా లేమని, అదనంగా మరో 5 ఎకరాల భూమి ఇస్తేనే పెండ్లి చేస్తామని చెప్పారు. దీంతో సౌమ్య శుక్రవారం కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్​బీ పోలీసులు దుబ్బా మనోజ్​ కుమార్​ రెడ్డిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

Next Story

Most Viewed