బిగ్‌బజాజార్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్!

by  |
బిగ్‌బజాజార్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా రిలయన్స్ సంస్థ హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఫార్మా రంగంలోని స్టార్టప్ కంపెనీని సొంతం చేసుకున్న రిలయన్స్ సంస్థ, తాజాగా దాని అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బిగ్‌బజార్‌తో పాటు ఇతర సంస్థలను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. దేశీయ దిగ్గజ రిటైల్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్‌లోని రిటైల్, హోల్‌సేల్, గిడ్డంగులు, లాజిస్టిక్స్ విభాగాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించింది. కిశోర్ బియానీ అధీనంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ సంస్థ గత కొన్నేళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొవిడ్-19 వ్యాప్తి తర్వాత రుణ భారాన్ని మోయలేక కిశోర్ బియానీ రిలయన్స్‌తో ఒప్పందానికి సిద్ధమయ్యారు. రుణాలతో పాటు కరోనా వల్ల ఫ్యూచర్ రిటైల్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఫ్యూచర్ గ్రూప్‌లోని ఇతర సంస్థల పరిస్థితి ఇలాగే ఉండటంతో కంపెనీ రుణ భారం మార్చి చివరి నాటికి రూ. 12,778 కోట్లకు చేరింది. అంతేకాకుండా కంపెనీ హోల్డింగ్ కంపెనీల మెజారిటీ షేర్లు తాకట్టులో ఉన్నాయి. ఈ ఒప్పందం విలువ రూ. 24,713 కోట్లని రిలయన్స్ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా ఫ్యూచర్ గ్రూప్ ప్రధాన వ్యాపారలైన బిగ్‌బజార్, ఈజీడే, సెంట్రల్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ విభాగంలో ఉన్న బ్రాండ్ ఫ్యాక్టరీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పరిధిలోకి వస్తాయి. ఈ వ్యాపారాలకు సంబంధించిన 1800 స్టోర్లు రిలయన్స్ రిటైల్ కిందకు వచ్చేస్తాయి. ఫ్యూచర్ గ్రూప్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా కొత్త ఫార్మాట్లలోకి ప్రవేశిస్తున్నామని, రిటైల్ పరిశ్రమలో తాము విజయవంతమయ్యేందుకు మా వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్ డైరెక్టర్ ఇషా అంబానీ చెప్పారు.



Next Story

Most Viewed