రిలయన్స్ ఓపెన్ ఆఫర్.. 26 శాతం..

by  |
Reliance1
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈపీసీ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్‌లో దేశీయ దిగ్గజ రిలయన్స్ అనుబంధ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ 40 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా సుమారు 26 శాతం వాటా కొనుగోలుకు భారీ మొత్తం చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో మొత్తం 4.91 కోట్ల పబ్లిక్‌ షేర్ల కోసం రూ. 1,840 కోట్లను ఇచ్చేందుకు రిలయన్స్ సంస్థ సిద్ధమైంది.

దీని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న షేర్ ధర కంటే 12 శాతం తగ్గింపుతో ఒక్కో షేర్‌కు రూ. 375 చెల్లించేందుకు ముందుకొచ్చినట్టు స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్(ఎస్‌డబ్ల్యూఎస్ఎల్) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. రిలయన్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ వెంచర్స్ ఈ కొనుగోలు కోసం ముందుకొచ్చాయి. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్‌ను రూ. 5,800 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా, దేశీయ సంస్థ స్టెర్లింగ్ అండ్ విల్సన్ లిమిటెడ్‌లో మొత్తం 40 శాతం వాటాను రూ. 2,845 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ఈ నెల ప్రారంభంలో స్పష్టం చేసింది. ప్రస్తుతం మొదటి దశలో 25.9 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌లో రూ. 1,840 కోట్లను చెల్లించనుంది. ఆ తర్వాత ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల కింద 15.46 శాతం వాటా కోసం రూ. 1,098 కోట్లను ఇవ్వనున్నట్టు రిలయన్స్ పేర్కొంది. మిగిలిన 9.7 శాతం కోసం రూ. 690 కోట్లను చెల్లించనుంది.


Next Story