బంధాలు వద్దు.. కాసులు, కామమే ముద్దు

by  |
బంధాలు వద్దు.. కాసులు, కామమే ముద్దు
X

దిశ, వెబ్ డెస్క్: బంధాలు .. అనుబంధాలు ప్రస్తుతం ఉన్న సమాజంలో వీటికి విలువ లేకుండా పోతున్నాయి. బంధాలు తెగుతున్నాయి.. నమ్మకం వెక్కిరిస్తోంది.. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి… కాసుల వేటలో పడి సొంత వారిని సైతం హతమార్చే స్థాయికి బంధాలు దిగజారుతున్నాయి. అమ్మ, అక్క, నాన్న, అన్న లాంటి బంధాలకు డబ్బు ఆనకట్ట వేస్తుంది. డబ్బుంటే చాలు .. ఇంకేం వద్దు అనేంతగా కాసులు మత్తు వల విసిరి పేగు బంధాలను కడతేరుస్తున్నాయి. మానవత్వం మంట గలిపి కరెన్సీ నోట్ల కోసం కన్నవారి కుంతుకలను తెంచడానికి కూడా సిద్దపడుతున్నారు. ఇలాంటి హత్యలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి… పిల్లలు అనాధలవుతున్నారు… వారి జీవితాలు జైళ్ల పాలవుతున్నాయి. ఒక్క జిల్లా అనే కాదు దేశం మొత్తం ఇలాంటి ఘటనలు భయాందోళనలను కలిగిస్తున్నాయి.

సొంతవారిని సైతం…

ఎన్నో ఆశలతో పిల్లల్ని తల్లిదండ్రులు పెద్దవాళ్ళని చేస్తున్నారు. వారిని చదివించి ప్రయోజకులను చేయడానికి ఎంతో శ్రమిస్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు జల్సాలకు, వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు ఇవ్వకపోతే ఆస్తులను అమ్మేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇంకా ఇవ్వమని బెదిరిస్తే వారిని మట్టుపెట్టి మరీ డబ్బు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వింటూనే ఉంటాం. పదినెలలు కడుపునా మోసిన తల్లైనా… చిన్నతనం నుండి తనతో కలిసి ఆడుకున్న తోబుట్టువులైనా… నిండు నూరేళ్లు కలిసి ఉండడానికి వచ్చిన కట్టుకున్నవారినైనా వీరు వదలరు. ఇక వీటిర్హో పాటు ఖర్చు ఎక్కువవుతుందని కన్నా బిడ్డలను కడతేరుస్తున్నారు తల్లిదండ్రులు. అనారోగ్యంతో ఉన్న కూతురికి వైద్యం చేయిస్తే ఎక్కడ డబ్బు ఖర్చవుతుందోనని కన్న కూతుర్ని కడతేర్చాడు ఒక కసాయి తండ్రి. తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని భార్యను రోకలిబండ తో కొట్టి చంపాడు ఒక దుర్మార్గపు భర్త. ఇలా చెప్పుకుంటే పోతూ చాలానే ఉన్నాయి.

వివాహేతర సంబంధాలు..

ప్రస్తుతం ఎక్కడ చూసిన వివాహేతర సంబంధాలే. వీటి వలన రెండు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బంధువుల్లో పరువు , మర్యాదను కోల్పోయి విచక్షణ రహితంగా మారుతున్నారు. తమను మోసం చేశారనే భావంతో కోపాన్ని, పగను పెంచుకొని హంతకులుగా మారుతున్నారు. గడిచిన మూడేళ్ళలో వీటి వలనే చాలామంది హత్యకు గురయ్యారు. ఈ వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల సంక్షేమాన్ని మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పెద్దలు చేస్తున్న తప్పులకు పిల్లలు అనాథలుగా మారడం లేక తల్లిదండ్రులు లేని పిల్లలుగా మారిపోతున్నారు. భర్తను కాదని ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను అమానుషంగా నరికి చంపాడో ఓ భర్త… ప్రియురాలితో తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నడిరోడ్డు మీద చితకొట్టిందో భార్య. వీటి నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వాటి వలన ప్రయోజనం లేకుండా పోతుంది. తమ వలన తమ కుటుంబ పరిస్థితి ఏమవుతుందని భయం ఉన్నప్పుడే ఇలాంటి వివాహేతర సంబంధాలు తగ్గు ముఖం పడతాయి.

ఆన్లైన్ పరిచయాలు..

ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి సామాజిక మాధ్యమాలు వాడుకలోకి వచ్చాకా వ్యక్తుల మధ్య సంబంధాలు జోరందుకున్నాయి. ఇక వీటి వలన జరిగే అనర్ధాలు అంతా ఇంతా కాదు. నగ్నంగా చాటింగ్లు, వీడియోలు… అవి బయటికి వస్తాయని బ్లాక్ మెయిల్స్, హత్యలు. ఇది కేవలం సామాన్యులకు కాదు చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నేతలకు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇటీవలే ఒక ముఖ్యమంత్రి రాసలీలల సీడీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇక వీటికి పరిష్కార మార్గం లేదా అంటే ఉంది. చిన్నతనం నుండి విద్యార్థులకు సరైన అవగాహనా పెంచుతూ పెంచాలి. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఆపాలి. భార్య భర్తల మధ్య ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ప్రేమ ,ఆప్యాయతలను మెరుగు పర్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన కొంతలో కొంతైనా ఈ మారణ కాండ ఆగుతుందేమో.

Next Story

Most Viewed