కరోనా వచ్చే… కాలుష్యం పోయే..!

by  |
కరోనా వచ్చే… కాలుష్యం పోయే..!
X

దిశ, ఆదిలాబాద్: జిల్లాలో కాలుష్య ప్రభావం గణనీయంగా తగ్గింది. ఒక్క మాటలో చెప్పాలంటే నెలరోజులుగా కాలుష్యం ప్రభావం లేదని చెప్పొచ్చు. విస్తీర్ణం రీత్యా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలోనే అతి పెద్దది. తూర్పున మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉండగా పశ్చిమాన నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. నాలుగు జిల్లాల్లోనూ ప్రస్తుతం కాలుష్యం లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనానే ఇందుకు కారణం అంటున్నారు.

తూర్పులో బొగ్గు కాలుష్యమే ఎక్కువ…

ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల జిల్లా ప్రాంతమంతా ప్రతినిత్యం కాలుష్యంతో సతమతమయ్యే ది. సింగరేణి బొగ్గు గనులతో పాటు ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. సిమెంట్, సున్నం రాయి పరిశ్రమలు, వీటి ఆధారిత, అనుబంధ పరిశ్రమలు అనేకం ఈ ప్రాంతంలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చెన్నూరు, శ్రీరాంపూర్, నస్పూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాశిపేట ప్రాంతమంతా బొగ్గు గనులతో కూడి కోల్ బెల్ట్‌గా పేరు పొందింది. ఈ ప్రాంతంలో పగలు రాత్రి తేడా లేకుండా గనులు నడుస్తూనే ఉంటాయి. మరోవైపు ఇటీవల కాలంలో ఓపెన్ కాస్ట్ గనులు పెద్ద మొత్తములో ఏర్పడడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయేది. అలాగే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విషయానికి వస్తే కాగజ్‌నగర్ పేపర్ మిల్లు‌తో పాటు ఈ జిల్లాలోనే సున్నపురాయి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో తూర్పు జిల్లా నిత్యం కాలుష్యమయంగానే ఉండేది.

పశ్చిమాన పత్తి మిల్లుల ప్రభావం

ఇక పశ్చిమ ప్రాంతమైన నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా పత్తి మిల్లుల ప్రభావం ఉండేది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, పరిసర గ్రామాలు, నిర్మల్ జిల్లాలోని భైంసా, నిర్మల్, సారంగాపూర్, సిర్గాపూర్ ప్రాంతాల్లో పత్తి మిల్లులు ఉన్నాయి. అలాగే నిర్మల్ ప్రాంతంలో పదుల సంఖ్యలో రైస్ మిల్లులు ఉన్నాయి. సరిగ్గా వేసవి కాలం సీజన్‌లోనే పత్తి మిల్లులు, రైస్ మిల్లులు ఎక్కువగా నడిచేవి.

కరోనా ప్రభావంతో కాలుష్యం ఖతం…

నెలన్నర రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండగా… ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ కరోనా ప్రభావం కారణంగా ఉమ్మడి జిల్లాలో కాలుష్యం గణనీయంగా తగ్గిందని అధికార వర్గాలు తెలిపాయి. బొగ్గు గనులు, సున్నం బట్టీలు, పేపర్ మిల్లు, రైస్ మిల్లు, పత్తి మిల్లుల నుంచి వచ్చే కాలుష్యం అంతా ఇంతా కాదని అభిప్రాయపడుతున్నారు.

గాలిలో పెరిగిన తేమ

ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ వేడిమి ప్రభావం తక్కువగానే ఉంది. గతంలో ఏప్రిల్ చివరి వారంలో ఎండమంట భరించలేకుండా ఉండేది. అసలు ఈ సీజన్లో ఉక్కపోత భరించలేక పోయే వాళ్లమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా ఎక్కడికక్కడ ఫ్యాక్టరీల మూసివేతతో కాలుష్యం పూర్తిగా తగ్గిపోయింది. ఎండలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, గాలిలో తేమశాతం పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా ఉష్ణోగ్రతల ప్రభావం జనంపై పెద్దగా చూపడం లేదు. ఉక్కపోతలు కూడా బాగా తగ్గాయని చెబుతున్నారు.

Tags: Adilabad, Reduced Pollution, Open Cast Mines, Chennai, Good Governance, Nirmal, Temperature, Storming, Factories

Next Story

Most Viewed