ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం, విధానాలపై ఆర్‌బీఐ సమీక్ష!

by  |
ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం, విధానాలపై ఆర్‌బీఐ సమీక్ష!
X

ముంబయి: భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాజమాన్యం, నియంత్రణకు సంబంధించిన విధానాలను సమీక్షించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)నిర్ణయించింది. సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్‌ ప్రసన్న కుమార్ మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష జరుపనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ బృందంలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సచిన్ చతుర్వేది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు లిల్లీ వడేరా, ఎస్‌సీ ముర్ము ఉన్నారు. ప్యానెల్ కన్వీనర్‌గా చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీమోహన్ యాదవ్‌ను నియమించారు. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పిస్తుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించిన నియంత్రణ, లైసెన్స్‌ నిబంధనలను సమీక్షించాలని ఆర్‌బీఐ ప్యానెల్‌ను కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్‌ దృష్టి సారిస్తుంది. అంతేకాకుండా లైసెన్సులు మంజూరు చేసిన అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుత నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్‌ తగిన సిఫారసులు చేస్తుంది. కోటక్‌ మహీంద్రా బ్యాంకులో నిబంధనల కంటే అధిక వాటా ప్రమోటర్లకు ఉండగా, దీనిపై ఆర్‌బీఐ, బ్యాంకు మధ్య కోర్టు బయట ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోటక్‌ బ్యాంకులో ప్రమోటర్లు 26శాతం వాటా కొనసాగించడానికి అనుమతిస్తూ ఓటింగ్‌ హక్కులను 1 శాతం వాటాలకు మాత్రమే ఆర్‌బీఐ పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి తర్వాత మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40శాతానికి, 10 ఏళ్లకు 20శాతానికి, 15 ఏళ్లకు 15శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుందని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. కోటక్‌ బ్యాంకులాగే తాము కూడా 26శాతానికి వాటా పెంచుకోవడానికి అనుమతించాలని ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ప్రమోటర్లు హిందుజా సోదరులు ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దీనికి సెంట్రల్ బ్యాంకు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ప్యానెల్‌ ఈ అంశంపై దృష్టి సారించనుంది.



Next Story

Most Viewed