అధిక రాబడి ఆశించే డిపాజిటర్లు జాగ్రత్త: ఆర్‌బీఐ గవర్నర్!

by  |
rbi governer
X

దిశ, వెబ్‌డెస్క్: డిపాజిటర్లు అధిక రాబడిని ఆశించే సమయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడి లేదా అధిక వడ్డీలు లభించే చోట అధిక నష్టాలకు కూడా అవకాశం ఉంటుందని డిపాజిటర్లు గుర్తించుకోవాలని ఆయన అన్నారు. ఆదివారం జరిగిన ‘డిపాజిటర్స్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో మాట్లాడిన దాస్, ఏవైనా బ్యాంకులు అధిక వడ్డీని ఇస్తాయని గుర్తించినప్పుడు అధిక రిటర్నుల కోసం ఖాతాదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో తగినంత అవగాహనను కూడా కలిగి ఉండాలన్నారు.

బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠంగా, స్థిరంగా కొనసాగేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తుందని, దీనికి డిపాజిటర్ల నుంచి పరోక్ష ప్రోత్సాహం ఉండాలని దాస్ పేర్కొన్నారు. ఇదే సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన డిపాజిట్ ఇన్సూరెన్స్ సంస్కరణల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతదారులకు విశ్వాసం పెరిగిందన్నారు. ఈ క్రమంలోనే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(సవరణ) బిల్లు-2021ను ఆమోదించామన్నారు. ఖాతాదారులు, వారి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ వారి నమ్మకాన్ని పెంచేందుకు డిపాజిటర్ల బీమా కవరేజీ పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు.

Next Story

Most Viewed