గ్లోబల్ గురువుగా రంజిత్..

by Shyam |
గ్లోబల్ గురువుగా రంజిత్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గదులు, బెంచీల సంగతి పక్కన పెడితే, అసలు బోర్డులు, డస్టర్‌లు కూడా లేని స్కూళ్లు చాలానే ఉన్నాయి. అలా మహారాష్ట్ర, సోలాపూర్ జిల్లాలోని పరితెవాడిలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా రంజిత్ సిన్హ్ దిసాలే 2009లో వచ్చాడు. ఆ తర్వాత స్కూలు పరిస్థితులు మార్చడమే కాకుండా, ఆ గ్రామంలోని బాలికలందరూ చదువు బాట పట్టేలా ప్రయత్నాలు చేశారు. ఆ గ్రామంలో, విద్యావిధానంలో అనేక మార్పులు చేశారు. ఆయన చేసిన కృషికి గానూ ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ వరించింది. 140 దేశాల నుంచి 12 వేల నామినేషన్లు రాగా, ఆ జాబితాలో రంజిత్ విజేతగా నిలిచాడు.

ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో చేస్తూ, సమాజంలో గొప్ప మార్పునకు కారణమవుతున్న ఉపాధ్యాయులకు సముచిత గౌరవం దక్కాలనే ఉద్దేశంతో వర్కే ఫౌండేషన్ 2014లో తొలిసారి ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్‌’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు ఈ ప్రైజ్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. అంత ప్రతిష్టాత్మకమైన అవార్డును ఈ ఏడాది రంజిత్ సిన్హ్ దిసాలే గెలవగా, ఆయనకు రూ. 7.38 కోట్ల(1మిలియన్ డాలర్స్) నగదు బహుమతి అందుకోనున్నాడు.

వినూత్న విధానాలతో పాఠ్యాంశాలను ఆడియో, వీడియో రూపంలో తీసుకురావడంతో పాటు, పుస్తకాలకు క్యూ ఆర్ కోడ్ ప్రవేశపెట్టి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అప్పటివరకూ గ్రామంలో బాలికా అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేది, అంతేగాకుండా బాల్య వివాహాలు కూడా అనేకం జరిగేవి. ఈ విషయం తెలుసుకున్న రంజిత్ బాల్య వివాహాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దాని వల్ల జరిగే నష్టాలను తల్లిదండ్రులకు వివరించి, వాటి నిర్మూలనకు కారణం అయ్యారు. రంజిత్ థియరీ చెబుతూనే, వాటిని ప్రాక్టికల్‌గా చేసి చూపించేవాడు. శని, ఆది వారాలను ప్రాక్టికల్ అంశాల కోసం కేటాయించేవాడు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని బాగు చేయించడంలోనూ రంజిత్ పాత్ర ఎనలేనిది.

‘కోవిడ్ 19 పాండమిక్‌ ఎడ్యుకేషన్ మీద చాలా ప్రభావం చూపింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ కూడా తమ బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిజిటల్ పాఠాలను చెప్పడానికి శ్రమించారు. చాలెంజెస్ స్వీకరించి విద్యార్థుల లైఫ్‌ను మార్చే రియల్ ఛేంజ్ మేకర్స్ టీచర్స్ మాత్రమే అని నిరూపించారు. పంచిపెట్టడంలోనే ఆనందముంటుందని నేను బలంగా నమ్ముతాను. అందుకే నాకు వచ్చిన ప్రైజ్‌మనీలో సగం నాతో పాటు ఫైనలిస్ట్స్‌గా నిలిచిన ఉపాధ్యాయులకు పంచుతాను. ఈ సమాజాన్ని మార్చడంలో వాళ్ల కృషి అభినందనీయం. ఇక మిగిలిన డబ్బులతో ఓ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, వెనకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు కృషి చేస్తాను’ అని రంజిత్ అభిప్రాయపడ్డారు.

‘రంజిత్ లాంటి ఉపాధ్యాయులు సమాజంలోని అసమానతలను రూపుమాపగలరు. ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించడంలో, ఆర్థిక వృద్ధికి తోడ్పాడునందించడంలో తమదైన ముద్ర వేయగలరు. మన భవిష్యత్తునే మార్చేయగలడు’ అని యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టెఫానియా పేర్కొంది. లండన్‌లోని నేచరల్ హిస్టరీ మ్యూజియం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది.Next Story

Most Viewed