వారిపై ఈగ వాలినా ఊరుకునేది లేదు.. ఎంపీ బడుగుల ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Rajya Sabha member Badugula Lingaiah
X

దిశ, సూర్యాపేట: రాష్ట్రంలో పెరిక కులానికి ప్రత్యేక గౌరవం ఉందని, స్వశక్తితో అద్భుతంగా జీవిస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెరిక సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బడుగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కులాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. సంవత్సరానికి రూ.20 వేల కోట్లు బలహీనవర్గాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు అందుకుంటున్న రైతుల్లో పెరికలూ ఉన్నారన్నారు. గత 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ పెరిక కులస్థులను పట్టించుకున్న పాపానపోలేదని గుర్తుచేశారు. రాబోయే కాలంలో బీసీబంధు పథకం తీసుకొచ్చి, బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెరిక కుల సంఘం భవనానికి భూమి ఇప్పించి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాదాపు అన్ని కులాలు నా నిధులు వాడుకుంటున్నాయని, కానీ, ఇప్పటివరకు ఒక్క పెరికలే తనను నిధులు అడగలేదని వెల్లడించారు. వారు అడగక పోయినా పదిలక్షలు కేటాయిస్తున్నానని హామీ ఇచ్చారు. ఇకనుంచి పెరిక సోదరులపై ఈగ వాలినా అక్కడ నేనుంటానని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశంలో కులం అనేది ఒక ఉనికి, కులమనేది గుర్తింపు, కులం అనేది సమూహం, ఒక రక్త బాంధవ్యం, బంధుత్వమని అని అన్నారు. తెలంగాణలో కేవలం తొమ్మిదిశాతం ఉన్న కులాలు మనలను ఏలడానికి కారణం కేవలం మనలో ఉన్న నిర్వహణ లోపమే అన్నారు. పెరిక కులానికి గుర్తింపు లేదని, ఈ వృత్తి అంతరించిపోయిందన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న టీచర్లు, పోలీసు ఆఫీసర్లు రాష్ట్రంలో ఎక్కడా లేరని ఇది నల్లగొండ జిల్లాకే గర్వకారణమన్నారు. హుజూర్‌నగర్ నుంచి మన కులానికి చెందిన వ్యక్తి ఐపీఎస్, మరో ఐఏఎస్ ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం సూర్యాపేట జిల్లా పెరిక సంఘం అధ్యక్షులుగా వనపర్తి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రాంబాబులతో పాటు ఇతర కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు.

సభకు వచ్చిన కుల బంధువులకు అన్నదాతలుగా వ్యవహరించిన కీత యాదగిరి, ఎర్రంశెట్టి ఉపేందర్, సుంకరి రమేష్‌లతో పాటు నూతన అధ్యక్ష, కార్యదర్శులను, వనపర్తి లక్ష్మీనారాయణ, సముద్రాల రాంబాబును శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి, సంఘం రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు మద్ద లింగయ్య, హైదరాబాద్ పెరిక హాస్టల్ అధ్యక్షుడు శ్రీరామ్ దయానంద్, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు వనపర్తి లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబు, సూర్యార్యాపేట పట్టణ అధ్యక్షులు బల్తూ శ్రీనివాస్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా 90 గ్రామాల నుంచి కులస్తులు హాజరయ్యారు.



Next Story

Most Viewed