రాజస్తాన్ ప్రభుత్వం పదిలం

by  |
రాజస్తాన్ ప్రభుత్వం పదిలం
X

న్యూఢిల్లీ: రాజస్తాన్ సర్కారు పదిలంగానే ఉన్నది. మెజార్టీ మార్కు 101 మించి బలాన్ని తన చేతుల్లో ఉంచుకున్నది. 30 మంది ఎమ్మెల్యేలు తన దగ్గర ఉన్నారని, అశోక్ గెహ్లాట్ సర్కారు ఇప్పుడు మైనార్టీలో పడిందన్న డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వ్యాఖ్యలు అసత్యాలేనని కాంగ్రెస్ నిరూపించుకుంది. ఇప్పటి వరకు సీఎం నివాసానికి 107 మంది ఎమ్మెల్యేలు చేరారు. నిన్న రాత్రి 2.30గంటలకు నిర్వహించిన సమావేశంలో అశోక్ గెహ్లాట్ సర్కారు సేఫ్‌గా ఉన్నదని కాంగ్రెస్ ప్రకటించింది. 109 మంది తమ మద్దతును కొనసాగిస్తున్నట్టుగానే విశ్వాస ప్రకటన లేఖలో సంతకాలు పెట్టారని రాజస్తాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అవినాష్ పాండే వెల్లడించారు.

కాగా, మూడు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఉపకరించిన జ్యోతిరాదిత్య సిందియాలాగే సచిన్ కూడా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలవనున్నారన్న కథనాలను పైలట్ కొట్టిపారేశారు. తాను బీజేపీలో చేరబోరని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రకటనతో సచిన్ పైలట్ వైపు పదిమందికి మించి ఎమ్మెల్యేలు లేరని స్పష్టమవుతున్నది. ఆదివారం రాత్రి తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని సచిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 10 మంది లోపు మద్దతున్నప్పటికీ బీజేపీ ప్రలోభాలకు దిగి, గట్టిగా ప్రయత్నిస్తే మరింత మందిని సచిన్ కూడగట్టగలరన్న భయాలు కాంగ్రెస్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ తిరిగి వచ్చేయాలని, కాంగ్రెస్ అతనికి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతుందన్న సోనియా గాంధీ అభిప్రాయాన్ని సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. విభేదాలన్ని పరిష్కరించుకోవచ్చునని తెలిపారు.

Next Story

Most Viewed