అన్నదాతల సందేశం తెచ్చిన రాహుల్.. ట్రాక్టర్‌పై పార్లమెంటుకు

by  |
అన్నదాతల సందేశం తెచ్చిన రాహుల్.. ట్రాక్టర్‌పై పార్లమెంటుకు
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు నూతన అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ మార్చ్ చేపట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఓ ట్రాక్టర్‌పై పార్లమెంటుకు వెళ్లారు. తాను రైతన్నల నుంచి పార్లమెంటుకు సందేశాన్ని తెచ్చారని చెప్పారు. సోమవారం ఉదయం ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ తీశారు. అనంతరం రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా, కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జేవాలా, బీవీ శ్రీనివాస్‌ సహా పలువురు నేతలతో రాహుల్ గాంధీ ట్రాక్టర్‌ను పార్లమెంటుకు నడుపుకుంటూ వెళ్లారు.

పార్లమెంటు ప్రాంగణానికి సమీపిస్తుండగానే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పార్లమెంటుకు వెళ్లడానికి వాహనానికి చెల్లుబాటయ్యే దస్తావేజులు ఉండాలని పేర్కొంటూ వారిని అడ్డుకున్నారు. ఐపీసీలోని 144 సెక్షన్‌ను ఉల్లంఘించారని పేర్కొంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, రణదీప్ సుర్జేవాలా, దీపేందర్ సింగ్ హుడా, శ్రీనివాస్ బీవీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ నడిపిన ట్రాక్టర్‌నూ అధికారులు సీజ్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించి అధికారులకు సమాచారమివ్వలేదని, అనుమతి తీసుకోలేదని తెలిపారు.

రైతుల గళాలు నొక్కేస్తున్నారు: రాహుల్

తాను పార్లమెంటుకు అన్నదాతల సందేశాన్ని తీసుకువచ్చానని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం అన్నదాల గళాలను నొక్కేస్తున్నదని, వారిపై పార్లమెంటులో చర్చ జరగనివ్వడం లేదని చెప్పారు. మూడు నల్లసాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ చట్టాలు కేవలం ఇద్దరు లేదా ముగ్గురి వ్యాపారల వేత్తల లబ్ది కోసమేనని దేశ ప్రజలందరికీ తెలుసని వివరించారు. కానీ, రైతులందరూ సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం వితండవాదం చేస్తున్నదని విమర్శించారు. ఆందోళనలు చేస్తున్న రైతులను ఉగ్రవాదులంటున్నదని ఆగ్రహించారు. వాస్తవంలో రైతుల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని ఆరోపించారు.

Next Story