తగ్గేదేలే.. మరో YCP ఎంపీని టార్గెట్ చేసిన రఘురామ కృష్ణంరాజు

by  |
raghurama krishnam raju,
X

దిశ, ఏపీ బ్యూరో : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ ఎంపీలకు ఝలక్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌ను ఇరుకున పెడుతూనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా సజ్జలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. తర్వాత వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి ఝలక్ ఇచ్చారు. అలాగే లోక్‌సభలో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను టార్గెట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోనే ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించాడని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెడితే అంతు చూస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సెంట్రల్ హాల్లో ఇతర ఎంపీల ముందు తనతో నీచంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారని రఘురామ ఆరోపించారు. ఆ సమయంలో ఇతర ఎంపీలు ఉండటంతో తాను సంయమనం పాటించినట్లు తెలిపారు.

ఆ తర్వాత లోక్ సభ స్పీకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సెంట్రల్ హాల్లోని సీసీ కెమెరాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. గోరంట్ల మాధవ్‌తో జగనే అలా మాట్లాడించారా? లేక జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన అలా మాట్లాడారో తెలియదని రఘురామ విమర్శించారు. తన ఫిర్యాదు పట్ల స్పీకర్ ఓంబిర్లా సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు చేస్తానని ఎంపీ రఘురామ తెలిపారు.

Next Story

Most Viewed