ఇండియాకు బయల్దేరిన రాఫేల్ జెట్లు

by  |
ఇండియాకు బయల్దేరిన రాఫేల్ జెట్లు
X

న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న భీకర యుద్ధ విమానాలు రాఫేల్ ఫైటర్ జెట్లు ఫ్రాన్స్‌లోని మెరినాక్ నుంచి బయల్దేరాయి. ఫస్ట్ బ్యాచ్‌లో భాగంగా ఐదు రాఫేల్ ఎయిర్‌క్రాఫ్టులు బుధవారం భారత్‌లో అంబాల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరనున్నాయి. రన్‌వే పైనుంచి టేకాఫ్ అవుతున్న రాఫేల్ విమానాల ఫొటోలు, వీడియోలను ఫ్రాన్స్‌లోని ఇండియన్ ఎంబసీ షేర్ చేసింది. సకాలంలో యుద్ధ విమానాలు అందించిన ఫ్రాన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.

ఈ ఘట్టంతో ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం మరో మైలురాయికి చేరుతుందని ఆశించింది. ఈ విమానాలు ఏడువేల కిలోమీటర్ల దూర ప్రయాణంలో యూఏఈలో ఒకసారి ఆగనున్నట్టు తెలిపింది. గగనతలంలోనే ఇంధనాన్ని నింపుకుంటూ భారత్ చేరుతాయని వివరించింది. రాఫేల్ రాకపై మీడియా కవరేజ్ ఇవ్వబోమని, ఆగస్టు ద్వితీయార్ధంలో రక్షణరంగంలోకి స్వీకరించినప్పుడు కవరేజ్ ఉంటుందని భారత వైమానిక దళం తెలిపింది. నాలుగేళ్ల క్రితం భారత్ 36 రాఫేల్ యుద్ధ విమానాల కోసం 7.87 బిలియన్ యూరో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిదశలో ఐదు విమానాలు భారత్‌కు వస్తున్నాయి. రాఫేల్ జెట్ల కోసం 12 భారతీయ పైలట్‌లకు ఇప్పటికే శిక్షణ పూర్తవ్వగా, మరికొందరికి శిక్షణ కొనసాగుతున్నది.



Next Story

Most Viewed