రాచకొండలో నకిలీ విత్తన ముఠా గుట్టురట్టు

by  |
రాచకొండలో నకిలీ విత్తన ముఠా గుట్టురట్టు
X

దిశ, క్రైమ్ బ్యూరో :
నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. రెండ్రోజుల క్రితమే రూ.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని నిందితులను జైలుకు పంపించగా, తాజాగా మరో రూ.22 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే ముఠాను అరెస్టు చేశారు. దీంతో ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.77 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడటం విశేషం. హయత్ నగర్ పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో బాచారం గ్రామ శివారు వద్ద మల్లె దేవేందర్ రెడ్డి, గోడల సాగర్ రెడ్డి, మల్లె వెంకట్ రెడ్డిలు శనివారం సాయంత్రం నకిలీ పత్తి విత్తనాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం, ఎల్బీనగర్ జోన్ పోలీసులు, హయత్ నగర్ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా వారిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే నిందితుల నుంచి 1.5 టన్నుల నకిలీ పత్తి విత్తనాలతో పాటు ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ పరికరాలు, దాదాపు 5 వేల వివిధ బ్రాండ్ల ఖాళీ లేబుల్ కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబు ఆ వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. అక్షర సీడ్స్‌లో ఎండీగా పనిచేసే ప్రవీణ్ కుమార్ (ఏ1) తన భార్య పద్మావతి (ఏ5), మల్లె దేవేందర్ రెడ్డి (ఏ2) భాగస్వాములుగా కూరగాయల విత్తనాలను విక్రయించేందుకు మూడేండ్ల క్రితం లైసెన్స్ తీసుకొని ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించారు. ఈ సంస్థలో గోడల సాగర్ రెడ్డి (ఏ3) మార్కెటింగ్ సూపర్ వైజర్‌గా, మల్లె దేవేందర్ రెడ్డి (ఏ2) కుమారుడు మల్లె వెంకట్ రెడ్డి (ఏ4) మార్కెటింగ్ చేయడంలో సహకరిస్తున్నాడు. కానీ, ఈ ఏడాది కూరగాయల విత్తనాలు విక్రయించే బదులుగా సులభంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి నకిలీ పత్తి విత్తనాలను అమ్మేందుకు నిశ్చయించుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో రమేష్‌ అనే వ్యక్తకి చెందిన లూస్ పత్తి విత్తనాలను బాచారం గ్రామ శివార్లలో వీరి గోడౌన్‌లో భద్రపరిచారు. వాటిని విరాట్, రాజ్ కోట్, జియో తదితర బ్రాండ్ల కంపెనీల కవర్లలో ప్యాక్ చేసి రైతులకు విక్రయించేందుకు పన్నాగం పన్నారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ వారిని పట్టుకున్నారు. ఘటనా స్థలంలో లేబులింగ్, ప్యాకింగ్ మిషిన్లు, ప్యాక్ చేసిన విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రైంలో మల్లె దేవేందర్ రెడ్డి, గోడల సాగర్ రెడ్డి, మల్లె వెంకటరెడ్డిలను పోలీసులు అరెస్టు చేయగా, ప్రవీణ్ రెడ్డి, అతిని భార్య పద్మావతి, రమేష్ (ఏ6)లు పరారీలో ఉన్నారు. సమావేశంలో ఎల్భీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, అడిషనల్ డీసీపీ జె. సురేందర్ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ జయరాం, ఎస్ఓటీ సీఐ రవికుమార్, వ్యవసాయ శాఖ ఏడీ సత్యానారాయణ, ఏవో బిక్యా సాల్మన్ నాయక్, హయత్ నగర్ సీఐ సురేందర్, ఎస్ఐలు రాజు పాల్గొన్నారు.

Next Story