జగన్‌కు ఆర్.నారాయణ మూర్తి పొగడ్తలు.. కాంగ్రెస్, టీడీపీకి చురకలు

by  |
Cine actor R. Narayana Murthy
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదని సినీనటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణ మూర్తి విమర్శించారు. సీఎం జగన్ మాత్రం ఈ ప్రాంతాలను పచ్చనిపంటలతో కళకళలాడించేందుకు ఏలేరు-తాండవ అనుసంధానం పనులకు నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఏలేరు-తాండవ కాలువల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి సమస్యలు తీర్చాలని తాను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశానని నారాయణమూర్తి వెల్లడించారు. తన విన్నపానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించి, వెంటనే నిధులు మంజూరు చేశారని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఏలేరు-తాండవ కాల్వల అనుసంధానం వల్ల విశాఖ జిల్లాకు చెందిన కోట వూరుట్ల, నాతవరం, నర్సీపట్నం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం, కోటనందూరు, ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాలకు నీటి సౌకర్యం కలుగుతుందన్నారు. ఈ మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్ కు రుణపడి ఉంటానని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఏలేరు-తాండవ పనుల నిమిత్తం రూ.470 కోట్లు మంజూరు చేశారని, అందుకు సహకరించిన మంత్రులు అనిల్ కుమార్, కన్నబాబులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Next Story