బోల్డ్ బ్యూటీకి ఎమ్మెల్యే టికెట్.. దేశం ఎటు పోతోందంటున్న నెటిజన్లు 

162

దిశ, సినిమా: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో మోడల్, నటి అర్చన గౌతమ్‌ స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆమెను హస్తినాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. యూపీలోని మీరట్‌లో జన్మించిన ఈ 26 ఏళ్ల నటి.. 2018 లో ‘మిస్ బికినీ ఇండియా’ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ, హసీనా పార్కర్‌’ వంటి హిందీ సినిమాలు సహా పలు తమిళ చిత్రాల్లోనూ నటించింది.

ఇదిలా ఉంటే, టికెట్ల పంపిణిలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించగా.. సీనియర్లను కాదని అర్చనకు టికెట్ ఇవ్వడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  ఈ నేపథ్యంలోనే తనకు అవకాశం కల్పించిన ప్రియాంక గాంధీకి అర్చన కృతజ్ఞతలు తెలిపింది. ప్రియాంక వాద్రా చేపట్టిన ‘గర్ల్ హూన్, లడ్ శక్తి హూన్’ ప్రచారానికి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొంది. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘రోజురోజుకు దేశం ఎటు పోతుందో అర్థం కావట్లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.