ఆవేదనలో టీచర్లు.. నిన్నటి వరకు వేలల్లో జీతం.. నేడు కూలీలు, టైలర్లు

by  |
ఆవేదనలో టీచర్లు.. నిన్నటి వరకు వేలల్లో జీతం.. నేడు కూలీలు, టైలర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిన్నటి వరకు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రైవేటు టీచర్లు కరోనా కాటుతో వ్యవసాయ కూలీలుగా, టైలర్లుగా, సూపర్ వైజర్లుగా, ఇతర ప్రైవేటు వృత్తులో స్థిరపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం రావడంతో తాము ఉపాధ్యాయులమని గుర్తుకొచ్చి ఒక్కసారిగా వారి కళ్లు చెమ్మగిల్లాయి. రెండేళ్లుగా సార్ అని పిలిచే విద్యార్థులకు దూరమై మనోవేదనను అనుభవిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం మనసు చంపుకొని ఉపాధ్యాయ వృత్తిని వదులుకుంటున్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తాము ఇకపై టీచర్ వృత్తిలోకి రామని చెబుతున్నారు.

ఆదివారం జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవం రాష్ట్రంలోని ఎంతో మంది ప్రైవేటు టీచర్లను కంటతడి పెట్టించింది. టీచర్లుగా ఉన్నప్పుడు తాము పాల్గొన్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని గుర్తుకు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. కొవిడ్ తెచ్చిన కష్టాలతో తాము ఎంతగానో ఇష్టపడే ఉపాధ్యాయ వృత్తికి దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావిభారత పౌరులను తయారు చేసిన తమకు భవిష్యత్తు లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యాల నుంచి, ప్రభుత్వాల నుంచి భరోసా లేకపోవడంతో ఉపాధ్యాయ వృత్తిలోకి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదన్నారు.

పాఠశాలల నుంచి రాని పిలుపు..

ఫిజికల్ తరగతులు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నప్పటకీ ప్రైవేటు పాఠశాలల నుంచి టీచర్లకు ఎలాంటి పిలుపు రాలేదు. విద్యార్థులు హాజరు అవుతున్నప్పటికీ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవడం లేదు. గతంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు విధుల్లోకి తీసుకున్న ఇద్దరు, ముగ్గురు టీచర్లతోనే పాఠశాలలను నిర్వహిస్తున్నారు.

చాలా వరకు పాఠశాలల్లో ఇప్పటి వరకు ఆన్‌లైన్ తరగతులను మాత్రమే నిర్వహిస్తుండటంతో ప్రైవేటు టీచర్లకు తిరిగి ఉపాధి లభిస్తుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే ఇతర వృత్తుల్లో స్థిరపడిన టీచర్లు.. పాఠశాల పిలుపు కోసం ఎదురుచూస్తున్న వారు ఇక ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లకూడదనే భావనలో ఉన్నారు.

వ్యవసాయ కూలీగా మారాను : రమేశ్ బియ్యా, సలాక్ పూర్, మద్దూరు(మం), సిద్ధిపేట జిల్లా

ఉపాధ్యాయల దినోత్సవం తలుచుకొని ఒక్కన్నే మనసులో కుమిలి పోయాను. రెండేళ్ల క్రితం ఉప్పల్‌లోని ఐకాన్ డిజిటట్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నప్పుడు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకున్నాం. విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం తమకు తోచిన బహుమతులు అందించి సత్కరించారు. అవన్నీ హ్యాపీ డేస్.. ఆ రోజులు ఇంక తిరిగి రావని గుర్తుచేసుకొని కన్నీళ్లు వచ్చాయి. ఉద్యోగం పోయిందనే బాధతో, ప్రభుత్వం భరోసా కల్పించలేదనే కోపంతో ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపలేదు. ఎమ్మెస్సీ బీఈడీ పట్టా ఉన్న నాకు ఉపాధి లేకపోవడంతో సొంత గ్రామానికి చేరుకొని వ్యవసాయ పనులు చేసుకుంటున్నా. అవసరాన్ని బట్టి వ్యవసాయ కూలీగా కూడా వెళుతున్నా.

టైలర్ పని నేర్చుకున్నా.. ఎంతో కొంత ఆదాయం వస్తుంది : రాసాల అనిత, అచ్చంపేట, నాగర్‌ కర్నూల్

స్కూల్స్ మూసివేయడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మానసికంగా ధైర్యం కోల్పోతున్న నేను.. నా భర్త సలహాతో టైలరింగ్ వర్క్ నేర్చుకున్నాను. ఏడాదిగా ఇదే పని చేస్తుండటంతో ఎంతో కొంత ఆదాయం వస్తున్నది. ఎంఏ బీఈడీ చేసి 7 ఏళ్లుగా టీచర్‌గా సేవలు అందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా కొంత మంది విద్యార్థులు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయురాలిగా సేవలు అందించినందుకు గర్వంగా అనిపించింది. మళ్లీ అలాంటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ, థర్డ్ వేవ్ వస్తే స్కూల్స్ మూతపడుతాయని భయంగా ఉంది. పాఠశాల యాజమాన్యం ఒక భరోసాను కల్పిస్తేనే తిరిగి టీచర్ వృత్తిలోకి వెళ్తాను.

20 ఏళ్లు టీచర్‌గా పనిచేశా.. ఇక స్కూల్ వైపు చూడను : గుడిపూడి మధుమూర్తి, నల్లగొండ

20 ఏళ్లుగా మ్యాథ్స్ టీచర్‌గా విధులు నిర్వహించాను. నేను పాఠాలు నేర్పించిన విద్యార్థులు నేడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా లక్షల జీతం సంపాదిస్తున్నారు. కానీ, నేను ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని పాలీహౌజ్‌లో సూపర్ వైజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఉపాధ్యాయ దినోత్సవం రావడంతో పిల్లలు కొంత మంది ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క సారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.

ఎంతో గౌరవప్రదమైన వృత్తిని నిర్వర్తించానని నా జీవితం సార్థకమైందనిపించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్ ఉద్యోగం ఆందోళనకరంగా ఉంది. కొవిడ్ సమయంలో పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వాలు భరోసా కల్పించకపోవడంతో ఎంతో మంది టీచర్లు రోడ్డునపడ్డారు. కుటుంబ పోషణ కోసం ఇతర వృత్తుల్లో స్థిరపడిపోయారు. కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్న నేను ఇక ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా.

Next Story