అకాల వర్షం.. అపార నష్టం

by  |
అకాల వర్షం.. అపార నష్టం
X

దిశ, మహబూబ్‌నగర్: అహర్నిశలు ఆరుగాలాల పాటు శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు రైతుల అశలను అవిరి చేశాయి. గత రెండ్రోజులుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అపార నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు. పంట చేతికి అందివచ్చిన సమయంలో ప్రకృతి కన్నెర చేయడం పట్ల రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన మూడ్రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పలు చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షం వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా రైతాంగం‌పై అధిక ప్రభావం చూపింది. మహబూబ్‌నగర్ జిల్లా విషయానికి వస్తే సుమారు 2,500 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 7 మండల్లాలో వర్షం పడగా, 6వ తేదిన కురిసిన వర్షానికి 130 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. 7వ తేదిన వర్షం తీవ్ర ప్రభావంతో 2,350హెక్టార్ల పంటను దెబ్బతీసింది. ఈ అకాల వర్షం కారణంగా ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లాలో సుమరు 4వేల పై చిలుకు రైతులు తమ పంటలను కోల్పోయ్యారు. వర్షపాతం విషయానికి వస్తే అత్యధికంగా 57 మి.మీ వర్షం వరకు జిల్లాలో నమోదు కావడం గమనార్హం.

జోగుళాంబ గద్వాల విషయానికి వస్తే ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మిర్చిపంట సాగు చేశారు. ఇప్పటికే రైతులు పంటను కోసి ఎండ బెట్టిన తరుణంలో అకాల వర్షం దెబ్బకు సుమారు 500 ఎకరాల పంట తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి మిర్చి ధరలు కూడా రూ.18వేలకు పైగానే పలుకుతున్న నేపథ్యంలో వర్షం రైతుల ఆశలను ఆవిరి చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 19వేల ఎకరాల వరకు మిర్చిసాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో పలు చోట్ల మామ్మిడి పంట కూడా దెబ్బతిన్నది. సుమారు 150 ఎకరాల వరిచేను కూడా పూర్తిగా నెలకొరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా విషయానికి వస్తే వర్షా ప్రభావం కేవలం అచ్చంపేట‌పై మాత్రమే చూపడంతో పెద్దగా నష్టం జరగలేదు. ఈ జిల్లాలో 150 ఎకరాల వరకు పంటనష్టం జరిగి ఉండొచ్చనీ, అలాగే మామ్మిడి పంటకు పెద్దగా నష్టం జరలేదని అధికారులు చెబుతున్నారు. నారాయణపేట జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లా వ్యాప్తంగా రైతులు సుమారు 26వేల ఎకరాల వరి పంటను సాగు చేయగా పలు చోట్ల వరి పంట నెలకొరిగినట్లు అధికారులు గుర్తించారు. కృష్ణ నది పరివాహాక ప్రాంతమైన మాగనూర్, కృష్ణ మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా చూపింది. మిగిలా ప్రాంతాల్లో పెద్దగా పంట దెబ్బతినలేదని అధికారుల అంచనా. అదే సమయంలో గాలులు బలంగా వీయడంతో జిల్లాలో వ్యాప్తంగా సుమారు 70వరకు విద్యత్ స్తంభాలూ నెలకొరిగినట్లు తెలుస్తోంది. దీని వల్ల పలు గ్రామాల్లో విద్యుత్ సమస్య తలెత్తింది. మిగతా ప్రాంతాల మాట ఎలా ఉన్న అకాల వర్షం ధాటికి వనపర్తి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు.
ఇప్పటి వరకు అధికారుల అంచనాల ప్రకారం సుమారు 4వేల పైచిలుకు ఎకరాల పంట నష్టపోయిందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అధికంగా వరితో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు చోట్ల మామ్మిడి పంట కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కురిసిన వర్షం కారణంగా జిల్లాలోని 6 మండలాల్లో వరి పంట, 2 మండలాలో మామ్మిడి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల కారణంగా పలువురు రైతుల చెందిన మామ్మిడి, బతాయి వంటి 30 నుంచి 40శాతం వరకు పంట నెలరాలింది. జిల్లా వ్యాప్తంగా 4వేల ఎకరాల వరకు వరి పంట నెలకొరిగింది. ఈ జిల్లాలో అత్యధికంగా ఖిల్లా ఘనపురం మండలంలో 32 మి.మి వర్షపాతం నమోదయ్యింది.

జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంట నెలకొ రగడంతో పాటు పంటపొల్లాలోకి నీరు వచ్చి చేరడంతో ఇప్పట్లో వరికోత యంత్రం సహాయంతో పంటలను కోసే అవకాశం కూడా లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న పంట కూడా రంగుమారే అవకాశం ఉందనీ, ఇది ధర‌పై ప్రభావం పడేలా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పంటనష్టం పై అంచనాలు తయారు చేయాలని అధికారులను అదేశించింది. అయితే, అది ఎంతవరకు వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. గతంలో కూడా తాము పంటల సాగు సమయంలో కట్టిన ఇన్సూరెన్స్‌ల నుంచి ఏనాడు ఒక్క రూపాయి కూడా రాలేదనీ, పంటనష్ట పరిహారం కూడా ఏండ్లుగా రావడం లేదని ఈ సారి కూడా వస్తుందనే నమ్మకం తమకు లేదని రైతులు అంటున్నారు. అయితే, కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో గ్రామాల్లో రైతులు ఇప్పటికే వరికోత యంత్రాలు లేక, ఒకవేళ కోసినా ధాన్యం మార్కెట్‌కు తరలించేదెలా? అనే సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రభుత్వం ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనేందుకు చర్యలు చేపట్టింది. టోకెన్ పద్ధతి ప్రకారం ఈ కొనుగోళ్లు జరగనున్నాయి. ప్రస్తుతం రైతులు పంటలను కోసి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్దంగా ఉంచారు. కాని వర్షాలు కురుస్తుండటంతో చాలా వరకు పంటలు తడిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Tags: Premature rain, Immense damage, paalamooru dist, lockdown

Next Story