పాకిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు విడుదల

by  |
Prashant
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన హైదరాబాద్‌‌ యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. వివరాళ్లోకి వెళితే.. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రశాంత్.. 2017లో స్వీట్జర్లాండ్‌లో ఉన్న తన ప్రియురాలిని కలవడానికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. పాకిస్తాన్‌ భూ భాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని అతనిపై కేసు నమోదు చేసి, జైలులో పెట్టాడు. దాదాపు నాలుగేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు సోమవారం అప్పగించారు.

కాగా, ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే, ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని భారత్ కోరింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. 2019లో ప్రశాంత్ తండ్రి బాబూరావు పోలీసు అధికారి సజ్జనార్‌ను కలిసి తన కుమారుడి విడుదల కోసం ప్రయత్నించాలని మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమాచారం చేరవేసిన సజ్జనార్ ప్రశాంత్ విడుదలకు చొరవ తీసుకున్నారు. కాగా, ప్రశాంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకున్నాడు. నాలుగేళ్లుగా కొడుకు కోసం పరితపిస్తున్న తల్లిదండ్రులు, ఎట్టకేలకు ప్రశాంత్ విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed