వైద్యుల్లేక.. నిండు గర్భిణి మృతి

by  |

దిశ, నల్లగొండ: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైద్యులు అందుబాటులో లేక ఓ నిండు గర్భిణి ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. డిండి మండలం ఎర్రారం గ్రామానికి చెందిన సమత(23)కు సోమవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సమయానికి వైద్యులు లేకపోవడంతో ఓ నర్సు గర్భిణికి మాత్రలు ఇచ్చింది. అనంతరం మరుగుదొడ్డికి వెళ్లిన గర్భిణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కొద్దిసేపటికి వైద్య సిబ్బంది వచ్చి చూడగా.. సమత అప్పటికే చనిపోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సమత చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ.. ఆగ్రహంతో ఆస్పత్రిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చజెప్పేందుకు యత్నించారు.

Tags: Pregnant, dead, devarakonda, nallagonda, ts

Next Story