వైఎస్సార్ టీపీలో పదవుల పంచాయితీ.. మధ్యలో ‘భారతి’

by  |
వైఎస్సార్ టీపీలో పదవుల పంచాయితీ.. మధ్యలో ‘భారతి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వమే ఎజెండాగా వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పార్టీని స్థాపించారు. అయితే ఎజెండాలోని ఏ ఒక్క అంశం పార్టీ కోసం పనిచేసే నిజమైన నాయకులకు వర్తించడంలేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకాల్లో ఇది తేటతెల్లమైంది. ఆది నుంచి పార్టీ జెండా మోసిన నాయకులను కాదని ఇతరులను కమిటీలో తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ నియామకాల్లో రాత్రి వరకు ఉన్న తమ పేర్లను తొలగించి కొత్త వారిని నియమించడమేంటని నాయకులు గగ్గోలు పెడుతున్నారు. షర్మిలకు అత్యంత సన్నిహితంగా మెలిగే కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చారని అసమ్మతి నేతలు చెబుతున్నారు.

డబ్బులుంటేనే పదవులు

వైఎస్సార్ తెలంగాణ పార్టీలో పదవి రావాలంటే డబ్బులుంటే చాలని, పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదని నియామకాల్లో చోటు దక్కని నేతలు చెబుతున్నారు. పార్టీ మొత్తం ఒక కార్పొరేట్ వ్యవస్థలా మారిందని, కేవలం బిజినెస్ మైండెడ్‌గా ఆలోచిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇలా అయితే తెలంగాణలో పార్టీ నడపడం కష్టమేననే భావనలో అసమ్మతి నేతలున్నారు. అసలు సిసలైన వైఎస్సార్ అభిమానులను వెతికి పట్టుకోవడంలో పార్టీశ్రేణులు విఫలమయ్యాయని వారు చెబుతున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే డబ్బుంటే సరిపోదని, పార్టీకి సేవ చేసే కార్యకర్తలు కావాలని వారు అభిప్రాయపడుతున్నారు.

అధినేత్రికి తెలిసే జరిగిందా?

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం పార్టీ అధినేత్రి షర్మిలకు తెలిసే జరిగిందా లేదా అనే అనుమానాలు అసమ్మతి నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ నియమకాలు చూస్తుంటే షర్మిలను ధిక్కరించేలా ఉన్నాయని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన కేటీ నరసింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత్రి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పిందని, కమిటీలో తమ పేర్లను కూడా తొలుత చేర్చారని ఆయన చెప్పారు. అయితే రాత్రికి రాత్రే పేర్లు ఎలా మారాయంటూ ఆయన అక్కడి నేతలను ప్రశ్నించారు. ఇలా జరగడానికి కొండా రాఘవరెడ్డి, సతీష్ అనే వ్యక్తులే కారణమని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ టీపీ అంతా కార్పొరేట్ వ్యవస్థ లాగా మారిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. రూ.5 లక్షలకు పదవులు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తాను షర్మిలను వ్యతిరేకించడం లేదని, పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నానన్నారు. పదవులు అమ్ముకున్న విషయానికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.

మొదలైన రాజీనామాలు

వైఎస్సార్ టీపీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కమిటీల నియామకంతో పార్టీని బలోపేతం చేద్దామనుకున్న షర్మిలకు చుక్కెదురైంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరించిన చేవెళ్ల ప్రతాపరెడ్డి తన రాజీనామా పత్రాన్ని లోటస్ పాండ్ కు పంపారు. చీఫ్ స్పోక్స్ పర్సన్ రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు జోరుగా సాగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంపై లోక్ సభ, శాసనసభలపై కనీసం అవగాహనలేని ప్రజాబలం లేని వారికి పదవులు కట్టబెట్టారని పలువురు నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దళితులకు సైతం కమిటీలో ప్రాధాన్యత దక్కలేదని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆవేదన చెందుతున్నారు. నతారి రంజిత్ నేతృత్వంలో ఆదివారం లోటస్ పాండ్ ఎదుట ధర్నాకు దిగేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సుమారు 30 మందికి పైగా వైఎస్సార్ అభిమానులు మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్ పీలో చేరుతున్నట్లు చెబుతున్నారు.

మహిళలకూ అన్యాయం

పార్టీ ఆవిర్భావం సందర్భంగా వైఎస్ షర్మిల తన పార్టీలో మహిళలకు పెద్ద పీట వేస్తానని, అన్నింట్లో 50 శాతం అవకాశాలు కల్పితస్తామని ప్రకటించారు. అయితే కమిటీల్లో మాత్రం అవకాశం కల్పించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వైఎస్సార్ టీపీ ఆవిర్భావం నాడు షర్మిల చేసిన ప్రకటనకు మహిళలంతా భారీగా తరలివచ్చి షర్మిలను సన్మానించారు. పార్టీ ప్రకటన నాటి నుంచి అహర్నిషలు పనిచేస్తున్న అందరికీ న్యాయం జరుగుతుందని వారు భావించారు. తీరా కమిటీల్లో మొండిచేయి చూపడం మహిళల ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు రెడ్డిలకు ఉన్న గౌరవం బీసీ మహిళగా తనకు దక్కలేదని ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన మహిళా నాయకురాలు వాట్సప్ గ్రూప్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

‘వైఎస్ భారతి’ జపంలో నేతలు

వైఎస్సార్ టీపీకి చెందిన అసమ్మతి నేతలంతా ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సతీమని వైఎస్ భారతి పేరును స్మరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి ఆమెను తీసుకురావాలని భావిస్తున్నారు. తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలను చూద్దామన్న నేతలకు కనీసం ప్రాధాన్యత కల్పించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘రావాలి భారతి-కావాలి భారతి’ అనే నినాదంతో సోమవారం అసమ్మతి నేతలంతా సమావేశానికి సన్నాహకాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నేతలను ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని వారు ప్రణాళికలు చేసుకుంటున్నట్లుగా సమాచారం. వీరికి మద్దతుగా కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు, రంగారెడ్డి జిల్లాకి చెందిన మాజీ శాసనమండలి సభ్యుడు, నల్లగొండ జిల్లాకి చెందిన ఒక మాజీ మంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed