సీఎంగా కేసీఆర్ కు ఇదే చివరి అసెంబ్లీ సెషన్!.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ

by Dishafeatures2 |
సీఎంగా కేసీఆర్ కు ఇదే చివరి అసెంబ్లీ సెషన్!.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 3న ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎంగా ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో కేసీఆర్ మొదటిసారి సీఎం పదవిని చేపట్టారు. తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఇక ఈ ఏడాది డెసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలే ఈ ధపా చివరి సమావేశాలు అని అంతా అనుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం జరగుతోన్నఅసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తన స్పీచ్ ప్రారంభంలో బీజేపీ, కాంగ్రెస్ లను విమర్శించిన సీఎం కేసీఆర్.. ప్రసంగం చివరిలో కొంత ఎమోషనల్ అయ్యారు. తనకు సీఎంగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో ఎప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన వాగ్దాటితో ఇబ్బంది పెట్టే కేసీఆర్.. ఆదివారం జరిగిన సమావేశాల్లో మాత్రం వాళ్లను పొగిడారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారిద్దరూ మంచి సలహాలను ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని సంబంధిత మంత్రులను ఆదేశించారు. మొత్తానికి ఇవాళ అసెబ్లీలో కేసీఆర్ స్పీచ్ విన్న ఎవరికైనా సీఎంగా కేసీఆర్ కు ఇదే చివరి సమావేశం అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

మే లేదా జూన్ లో సీఎంగా కేటీఆర్ కు పట్టాభిషేకం..!


కేటీఆర్ ను సీఎం చేయాలని బీఆర్ఎస్ లో ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. కేటీఆర్ ను సీఎం చేయడానికి గతంలో రెండుసార్లు ముహూర్తం పెట్టారని.. కానీ కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయిందని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనే జరిగింది. అయితే మునుగోడు బైపోల్ లో కేటీఆర్ అన్ని తానై నడిపించి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. ఇక అప్పటి నుంచి కేటీఆర్ ను సీఎం చేయాలనే డిమాండ్ పార్టీలో మళ్లీ మొదలైంది. ఇటీవలే కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పలు సభలు పెట్టి దేశంలో మార్పు తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీని పెట్టినట్లు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం అంటూ కేసీఆర్ పలు వేదికల్లో స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కు తెలంగాణ అధ్యక్షుడిగా కేటీఆర్ ను నియమించి కేసీఆర్ జాతీయ అధ్యక్షుడి హోదాలో దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించనున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారానికి పంపనున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తీర్మానంపై గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కు బదులు కేటీఆర్ అధికారపక్ష నాయకుడిగా వ్యవహరించారు. తన వాగ్దాటితో ప్రతిపక్షాలను ఇరుకును పెట్టేలా కేటీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేటీఆర్ మాట్లాడుతన్నంత సేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చప్పట్లు కొడుతూ కనిపించారు.

ఈ ప్రసంగం తర్వాత పార్టీలో కేటీఆర్ కు బాగా మైలేజ్ వచ్చింది. తండ్రిని మించిన తనయుడు, సీఎంగా కేటీఆర్ అన్ని విధాల అర్హుడు అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల వరకు ఆగకుండా ఎన్నికలకు ముందే కేటీఆర్ ను సీఎం చేసి.. ఆ తర్వాత కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, అందుకే కేటీఆర్ ను సీఎం చేసి ప్రచారానికి పంపితే ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ ప్లాన్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మే లేదా జూన్ లో కేటీఆర్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Also Read: *బిగ్ న్యూస్: ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు*



Next Story

Most Viewed