AP Politics: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హాస్యాస్పదంగా మాజీ సీఎం జగన్ వైఖరి..

by Indraja |
AP Politics: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హాస్యాస్పదంగా మాజీ సీఎం జగన్ వైఖరి..
X

దిశ వెబ్ డెస్క్: ఇటివల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి 164 సీట్లను కైవసం చేసుకుని అఖండ మెజారిటీతో విజయం సాధించింది. కాగా అప్పటి వరకు అధికారపార్టీగా ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనితో కూటమి విజయం వెనుక కుట్ర ఉందని, ఓటు ట్యాపరింగ్ ఓట్లతో కూటమి విజయం సాధించిందని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రత్యక్షంగా పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. మరి అప్పుడు ఈవీఎంలు ట్యాపరింగ్ చేయడం వల్లనే వచ్చాయా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలానే నేడు పరోక్షంగా ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారని ఆరోపిస్తూ.. పార్టీనేతలని, వైసీపీ సోషల్ మీడియా మూకలను రెచ్చగొడుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌.. కేతిరెడ్డి వ్యాఖ్యలు..

ఈవీఎంల ట్యాంపరింగ్‌ కారణంగానే కూటమి అధికారంలోకి వచ్చిందని పలువురు అంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. అయితే సుప్రింకోర్టు చెప్పినట్టు ఈవీఎంలను చెక్ చేయించవచ్చుగా అని అందరూ అంటున్నారని, కానీ.. ఈవీఎం చెక్ చేయించాలి అంటే కలెక్టర్ ఒక్కో ఈవీఎంకి 47 వేల రూపాయలు చెల్లించాలని అన్నారు.

డబ్బులు కట్టి చెక్ చేయించినా.. ఈవీఎంలను టెస్ట్ చేయడానికి వచ్చేది ఆ కంపెనీ వ్యక్తేనని, ఏ కంపెనీ వాళ్లైనా వాళ్ల ప్రోడక్ట్‌లో సమస్య ఉందని చెప్తారా అని ప్రశ్నించారు. వాళ్ల కంపెనీ తయారు చేసిన ఈవీఎంలు కనుక అంతా బాగుందనే చెప్తారు అని అన్నారు. అలానే కొన్ని సర్వే సంస్థలు ముందుగానే కూటమికి ఎన్ని ఓట్లే వస్తాయో చెప్పాయని, ప్రజలు తమ ఓటును ఎవరికి వేశారో చెప్పినట్లైతే అన్ని సర్వేసంస్థలకి చెప్పాలిగా, కొన్ని సర్వేసంస్థలకే ఎందుకు చెప్తారు అని ప్రశ్నించారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్..

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. కాగా ఆ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల విషయంలో తనకు పలు అనుమానాలు ఉన్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని, ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం అని వేసీపీ అధినేత వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.

అయితే 2024 ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రాగా వైసీపీకి 11 సీట్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి కుట్ర చేసిందని, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, అందుకే అన్ని సీట్లు వచ్చాయని పార్టీ శ్రేణులు, వైసీపీ సోషల్ మీడియా మూకలు ఆరోపిస్తున్నాయి. జగన్ సైతం ఎవరో మోసం చేశారని, అన్యాయం చేశారని అనవచ్చని కాని ఆధారాలు లేవు అని పరోక్షంగా ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానం వ్యక్తం చేశారు.

హాస్యాస్పదంగా మాజీ సీఎం జగన్ వైఖరి..

2019లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని, ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమన్న మాజీ ముఖ్యమంత్రి 2024లో తన పార్టీ శ్రేణులు, అనుచరులు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు..? అప్పుడు ఆయన పార్టీకి 151 సీట్లు సక్రమంగా వచ్చినప్పుడు.. ఇప్పుడు కూటమికి 164 సీట్లు సక్రమంగా వచ్చినట్టేగా అని ప్రశ్నిస్తున్నారు.

ఐదేళ్ల ముందు అసాధ్యమైన ఈవీఎంల ట్యాంపరింగ్ ఐదేళ్లలో సుసాధ్యమైందా..? అని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని బల్ల గుద్ది చెప్పిన వైఎస్ జగన్ ఇప్పుడు ఓడిపోగానే ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారంటే హాస్యాస్పదంగా ఉందని పలువురు జగన్‌ను ఎద్దేవా చేస్తున్నారు.



Next Story

Most Viewed