రైతుల కన్నీళ్లను ఆపిన కేసీఆర్ కి ధన్యవాదాలు : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

by Disha Web Desk 9 |
రైతుల కన్నీళ్లను ఆపిన కేసీఆర్ కి ధన్యవాదాలు : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
X

దిశ, నర్సంపేట: దేశ చరిత్రలో సన్న, చిన్నకారు రైతులతో వారి పంటల్లో తిరిగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని నర్సంపేట నియోజక వర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొనియాడారు. వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే అండగా ఉంటుందని గురువారం ముఖ్య మంత్రి తెలిపినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా నష్టపోయిన రైతుల పక్షాన, బీఆర్ఎస్ శ్రేణుల పక్షాన కృతజ్ఞత తెలిపారు. దీనికి సంబంధించి నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ... నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ప్రకారం 32193 ఏకరాల వివిధ రకాల పంట నష్టం ఇటీవల జరిగినట్లు తెలిపారు. నర్సంపేట నియోజక వర్గంలోనే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్య మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. వడగండ్ల వర్షంతో నష్టపోయిన పోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ సర్వేకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 33 శాతం కన్నా ఎక్కువ నష్టం జరిగిన పంటలకు పంటతో సంబంధం లేకుండా అన్ని పంటలకు వర్తింపచేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది స్పష్టం చేశారు. పంట యజమానులకు కాకుండా పెట్టుబడి పెట్టిన కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా రైతే కేంద్రంగా సర్వేలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

ప్రతిపక్ష పార్టీలపై పెద్ది ఫైర్..!

రాష్ట్రంలో కేవలం ప్రెస్మీట్లకే ప్రతి పక్ష పార్టీల అధ్యక్షులు పరిమితమయ్యారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఒక్క పంట చేనును పరిశీలించిన పాపాన పోలేదని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ నష్టం జరిగితే తక్కువ చూపెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఇది నిజం కాదన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు నర్సంపేటకు రావాలని సవాల్ విసిరారు. నష్టం ఎంత జరిగిందో అప్పుడు తెలుస్తుందన్నారు. పిచ్చి కూతలు..పిచ్చి నాయకులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి అని తూర్పార పట్టారు. రేవంత్, బండి లది జెండాలే వేరని వీరి ఎజెండా మాత్రం ఒక్కటే అన్నారు. వీరిద్దరిదీ చైల్డ్ బ్రెయిన్ అని ఎద్దేవా చేశారు. మీడియాలో కనపడటానికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యే..

ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నేషనల్ డిజాస్టర్ ఫండ్ అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. ఎన్. డీ. ఆర్. ఎఫ్ నిధులు రూ.1816 కోట్లు విడుదల చేశారని, కేవలం ఎన్నికలు జరిగే 5 రాష్ట్ర లకు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధుల నుండి ఒక్క పైసా కూడా తెలంగాణ కు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం సరిపోవట్లేదంటూ బండి సంజయ్ నీకు దమ్ముంటే ఇంత కన్న ఎక్కువ తీసుకురా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం వదిలి పెట్టేలా, రైతులను భూమికి వేరుచెయ్యలనే చూసే పార్టీ బిజేపి పార్టీ అని ఆరోపించారు.ఒక్క రూపాయి కూడా తెలంగాణకు రానివ్వకుండా చేస్తున్నట్లు ఆరోపించారు.

రైతులు జాగ్రత్తగా ఉండాలని పెద్ది సూచన..

వచ్చే రెండు మూడు రోజుల్లో వడగండ్ల వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలిచ్చినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న పంటను రక్షించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.



Next Story

Most Viewed