నాయకుల తెలివే తెలివి.. గుట్టుచప్పుడు కాకుండా 'సెకండ్'..

by Disha Web Desk |
నాయకుల తెలివే తెలివి.. గుట్టుచప్పుడు కాకుండా సెకండ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్మార్ట్ ఫోన్లు కొత్త చిక్కులు తెస్తున్నది. ఎక్కడున్నది? ఏం చేస్తున్నది? లొకేషన్‌తో సహా తెలిసిపోతుంది.. ఫేస్ బుక్ అకౌంట్ ఆన్‌లో ఉంచినా ఎక్కడ ఉన్న విషయం ఇతమిద్ధంగా తెలిసిపోతున్నది. లీడర్ల ఫోన్ నంబర్లు జనాలకు నోటెడ్. ఎవరెవరో చేస్తూ విసిగిస్తున్నారు. ఇక ఏ పార్టీ కార్యకర్త, లీడర్‌తో మాట్లాడినా కష్టాలే. ఏ ముచ్చట పెట్టినా ఇట్టే అధినాయకత్వానికి తెలిసిపోతుంది. అందుకే తాజాగా చాలా మంది నాయకులు సెకండ్ ఫోన్ మెయింటెయిన్ చేస్తున్నారు. కొత్త సిమ్ తీసుకుంటున్నారు. అది కూడా స్మార్ట్ ఫోన్‌లో వేయడం లేదు. తక్కువ ధరకు వచ్చే.. ఇంటర్నెట్ లేని.. డమ్మీ ఫోన్‌లో సిమ్ వేసి వినియోగిస్తున్నారు. ఎవరైనా కాల్ చేయగానే .. ఒక్క నిమిషం నేనే చేస్తానంటూ కాల్ కట్ చేస్తున్నారు. కొత్త నంబరుతో మాట్లాడుతుండడం విశేషం. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సెకండ్ ఫోన్ మెయింటెయిన్ చేయడం తప్పనిసరి అయిపోయింది. లేదంటే పీఏలు, ఇతర కార్యకర్తల ఫోన్లు తీసుకొని వాడుతున్నారు. అసలే అన్ని పార్టీ అధిష్ఠానాలు జంప్ జిలానీలపై దృష్టి పెట్టాయి. ఎవరిని లాక్కుంటే బాగుంటుంది? వాళ్లను సీక్రెట్ గా ఎక్కడ కలుసుకోవాలి? అన్న అంశాలపై దృష్టి పెట్టాయి. దానికి కూడా ఈ సెకండ్ ఫోన్ బాగా పనికొస్తున్నది. ఐతే ఆ సెకండ్ నంబరు మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎవరికైనా దాని నుంచి కాల్ చేసి మాట్లాడినా ఆ నంబరు తనది కాదని, ఫ్రెండ్ దని, బంధువుదంటూ చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో లీడర్స్ కొత్త లైఫ్ స్టయిల్ కు అలవాటు పడుతున్నారు.

డేటా బంద్

స్మార్ట్ ఫోన్ లోనూ డేటా ఆఫ్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసి వినియోగిస్తున్నారు. ఫేస్ బుక్ వంటి యాప్స్ ఆన్‌లో ఉంచితే లొకేషన్ తెలిసిపోయే ప్రమాదం ఉంది. పైగా స్మార్ట్ ఫోన్ అన్ని రకాలుగా యమ డేంజర్ అని గుర్తించారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ వినియోగం కూడా సొంత స్మార్ట్ ఫోన్ నుంచి చేయడం లేదని తెలిసింది. పైగా సొంత ఫోన్ నుంచి కాల్ చేస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు. నిన్న టీఆర్ఎస్, ఈ రోజు బీజేపీ.. రేపు కాంగ్రెస్‌లోకి పోవాల్సిన అనివార్యత ఏర్పడొచ్చు. ఈ క్రమంలో సొంత ఫోన్ లో ఇతర పార్టీ నాయకులతో మాట్లాడడం కూడా సరైంది కాదంటున్నారు.

అసంతృప్తి నేతలైతే..

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి నాయకులు, కార్యకర్తలైతే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఫోన్ చేసినా సాధారణ కాల్స్ లో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. వాట్సాప్, సిగ్నల్ వాడుతున్నారు. వాటితో ఏం మాట్లాడినా రికార్డు చేసే అవకాశాలు తక్కువ అంటున్నారు. ప్రధానంగా రాజకీయ అంశాలు మాత్రం సాధారణ కాల్ లో మాట్లాడడం లేదు. ముందుగానే అన్నా.. మీరు రికార్డు చేస్తారు. నేను ఏం మాట్లాడనని తెగేసి చెబుతున్నారు. పార్టీ అభ్యర్ధిత్వాల పట్ల కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరైతే సొంత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వారెవరిని కలిశారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలో నిఘా బృందాలు రికార్డు చేస్తాయన్న విషయం గుర్తించారు. అందుకే సొంత నంబరుతో మాట్లాడేందుకు జంకుతున్నారు. ఎవరికీ చిక్కకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని కూడా ఎవరికీ చెప్పడం లేదు. ఇక రాజకీయ మంతనాలు సాగించేందుకు మాత్రం రహస్య ప్రాంతాల్లో కలుస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక మాత్రం లీడర్లకు చిన్న ఫోన్ దారి చూపిస్తున్నది.


Next Story

Most Viewed