ఓటెయ్యమని టీడీపీ సంప్రదించింది.. బాంబు పేల్చిన టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్

by Dishafeatures2 |
ఓటెయ్యమని టీడీపీ సంప్రదించింది.. బాంబు పేల్చిన టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు గురి చేసిందంటూ అటు వైసీపీ ఇటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలోకి టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ వచ్చి చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలని పచ్చ పార్టీ నేతలు తనను సంప్రదించారని వెల్లడించారు. పోలింగ్ తేదీ వరకు టీడీపీ నేతలు ఓటు కోసం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇందుకు తగిన ఆధారాలను సైతం బయటపెట్టారు. తన కాల్‌ డేటాను మీడియాకు చూపిస్తూ ఎవరు ఫోన్ చేశారో ఈ కాల్ డేటా చూస్తే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మద్దాలి గిరిధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అంటూ విమర్శలు చేశారు. నేను నా వాళ్లు మాత్రమే అనే నైజం చంద్రబాబుది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో తమకు సరైన గౌరవం లభించలేదని అందువల్లే పార్టీని వీడినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానం.. ఆయనకు ఉన్న పరిపాలన దక్షతను చూసి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ పతనమవ్వడానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కారణమని చెప్పుకొచ్చారు. ఇకపోతే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మండిపడ్డారు. అమరావతి ఉద్యమం కోసం శ్రీదేవి పోరాడతాననడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. నాడు వ్యతిరేకించి నేడు రాజకీయ అవసరాల కోసం జై కొడితే ప్రజల విశ్వాసం కోల్పోతారు అని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూచించారు.


Next Story

Most Viewed