రేవంత్ ఇలాకలో హస్తం పార్టీ ఉనికి పాట్లు

by Javid Pasha |
రేవంత్ ఇలాకలో హస్తం పార్టీ ఉనికి పాట్లు
X

దిశ, కంటోన్మెంట్: తెలంగాణ రథసారధి రేవంత్ రెడ్డి సొంత ఇలాక అయిన కంటోన్మెంట్ లో హస్తం పార్టీ ఢీలా పడింది. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యుహా ప్రతి వ్యుహాలతో ముందుకు వెళ్లుతుంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత బోర్డు పాలక మండలి ఎన్నికలలో అధికార గులాబీ పార్టీతో నువ్వా.. నేనా అనే రేంజ్ లో ఢీకొట్టిన హస్తం పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. రోజు కోకరు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. పార్టీని వీడే వాళ్లంతా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పొరాడే దమ్ము లేదనడం ఆ పార్టీ పరిస్థితిని మరింత కుంగదీస్తోంది.

రేవంత్ ఇలాకలో గడ్డు పరిస్థితి..

తెలంగాణ పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది.రేవంత్ రెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కంటోన్మెంట్ బోర్డు విస్తరించి ఉంది. ఏప్రిల్ 30వ తేదీన కంటోన్మెంట్ బోర్డు పాలక మండలికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు అన్ని అస్త్రాలను సిధ్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే క్యాండిటేట్ల ఎంపిక కోసం సర్వేలు నిర్వహిస్తున్నాయి. మద్దతు తమకే ఉంటుందని భావిస్తున్న స్థానిక పార్టీ లీడర్లు ముందుస్తు ప్రచారానికి తెరలేపారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి పరిస్థతి ఏమి కనిపించడంలేదు. ముఖ్యంగా బోర్డు ఎన్నికలలో పోటీ చేసేందుకు వార్డుల వారిగా ఒకరిద్దరూ మినహా మెజారిటీ వార్డుల నుంచి హస్తం నేతలు అసక్తి చూపించడంలేదు.

గత బోర్డు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏడో వార్డు అభ్యర్థి ప్యారసాని భాగ్యశ్రీ విజయం సాధించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు భాగ్యశ్రీ తన భర్త, మాజీ బోర్డు సభ్యుడు శ్యాంకుమార్ తో కలిసి గులాబీ గూటికీ చేరారు.తాజాగా రెండవ వార్డుకు చెందిన పార్టీ సీనియర్ నేత శ్యాంసన్ రాజు సైతం కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇలా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ వలసతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ తో గతంలో గులాబీ ముళ్లు గుచ్చుకుంటే.. ఇప్పుడు కాషాయ పార్టీ వలతో కాంగ్రెస్ డీలా పడింది.

నాయకత్వ లేమీతో సతమతం

స్వాతంత్య్రం పూర్వం నుంచి ఉన్న వృద్ధ పార్టీ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో పవర్ పోవడంతో కంటోన్మెంట్ లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలయింది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డియే స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ, పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం కొట్టోచ్చినట్లు కనిపిస్తుంది. గత బోర్డు ఎన్నికలలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్య నారాయణ నాయకత్వంలో పార్టీ అన్ని వార్డులలో పోటీ చేసింది. ఎనిమిది వార్డులకుగాను ఏడు వార్డులలో లో ఓటమి చవి చూసినా.. ఏడో వార్డులో మాత్రం విజయం సాధించింది. మిగితా చోట్ల పార్టీ బలపరిచిన అభ్యర్థులు గౌరవ ప్రదమైన ఓట్లనే సాధించి పార్టీ పరువును నిలబెట్టారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సర్వే సాయన్న చేతిలో ఓటమి పాలయ్యారు.

ఎన్నికల అనంతరం నాటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సర్వే గొడవ పడగా, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఉత్తమ్ అనుచరుడైనా బొల్లి కిషన్ ను కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్ చార్జీగా పార్టీ నియమించింది. స్థానికేతరుడైన బొల్లి కిషన్ అడపా దడపా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారే తప్ప.. క్యాడర్ ను సమన్వయం చేయడం లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నారు.కంటోన్మెంట్ తో పాటు బొల్లి కిషన్ జహీరాబాద్ ఇన్ చార్జీగా కూడా బొల్లి కిషన్ కొనసాగుతున్నాడు. దీంతో ఇటు కంటోన్మెంట్ లో సరైన టైం ఇవ్వక, అటు జహీరాబాద్ లోనూ పార్టీని బలోపేతం చేయక సతమతమవుతున్నాడని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.దీనికితోడు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడైనా పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర‘ పేరిట అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించే అవకాశం లేదనిపిస్తోంది.

Next Story