అక్షరాల 'లక్ష'.. మునుగోడులో ఓటరు కోసం బీజేపీ స్కెచ్..!

by Disha Web Desk |
అక్షరాల లక్ష.. మునుగోడులో ఓటరు కోసం బీజేపీ స్కెచ్..!
X

మునుగోడులో లక్షకు పైగా ఓట్లు సాధించేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. గడపగడపకూ వెళ్లి ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళిక రూపొందిస్తున్నది. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేసేలా ప్లాన్ వేస్తున్నది. శనివారం మునుగోడు బీజేపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గడపగడపకూ చేరువ కావాలని బీజేపీ భావిస్తున్నది. ప్రతి ఓటరునూ కలిసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇప్పటికే బైపోల్ ప్రిపరేషన్ ‌ను షురూ చేసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు స్టీరింగ్ కమిటీకి చెందిన 16 మంది సభ్యులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికను గెలవాలంటే అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించారు. ఎలాంటి వ్యూహంతో మునుగోడును గెలవొచ్చనే అంశాలను ప్రస్తావించారు. కమిటీలోని ప్రతి ఒక్కరి సలహా, సూచనలు, అభిప్రాయాలను తీసుకున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

దసరా తర్వాత స్పీడప్..

దసరా తర్వాత కార్యక్రమాల వేగాన్ని మరింత పెంచాలని నాయకులు నిర్ణయించారు. ప‌లువురు స‌భ్యులు చేసిన సూచ‌న‌ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. మండ‌లాల వారీగా ఇన్ చార్జీలను రంగంలోకి దింపి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మునుగోడులో దాదాపు 2.25 లక్షలకు పైగా ఓట్లున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లక్షకు పైగా ఓట్లను టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని నేతలకు ఆదేశించనున్నారు. దసరా నేపథ్యంలో ప్రతి వ్యక్తిని కలిసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

స్టీరింగ్ క‌మిటీలో ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి సైతం పాల్గొని స్థానిక అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌కు సంబంధించిన పత్రాలను విడుద‌ల చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే విధంగా మునుగోడు అభివృద్ధిపై ప్రత్యేకంగా మెనిఫెస్టోను రూపొందించాల‌ని స‌భ్యులు సూచించినట్లుగా తెలిసింది. కేంద్ర ప‌థ‌కాలను అమలు చేయకపోవడం, నిధులు దారి మళ్లించడం, కేంద్ర పథకాలను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్నదనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేపట్టాలని భావిస్తున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడంలేదనే ఆరోపణలను తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించే అవ‌కాశం ఉందనే అంశంపై కూడా నేత‌లు స‌మాలోచ‌న‌లు చేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాల‌ను దెబ్బకొట్టే విధంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, మునుగోడును గెలిచేందుకు రచించాల్సిన వ్యూహాలపై మళ్లీ మూడు నాలుగు రోజుల్లో భేటీ కావాలని, అప్పటి వరకు మరిన్ని వ్యూహాలకు పదును పెట్టి బైపోల్ లో గెలవాలని కాషాయదళం భావిస్తున్నది.



Next Story

Most Viewed