సౌత్ స్టేట్స్‌పై BJP ఫోకస్: కమలంతో పొత్తు విషయంలో ఆ పార్టీలో భిన్న స్వరాలు!

by Disha Web Desk 19 |
సౌత్ స్టేట్స్‌పై BJP ఫోకస్: కమలంతో పొత్తు విషయంలో ఆ పార్టీలో భిన్న స్వరాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సౌత్ ఇండియాలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీకి అనూహ్య మద్దతు లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇందులో పళనిస్వామి, పన్నీర్ సెల్వం రెండు వర్గాలకు నేతృత్వం వహిస్తున్నారు. అయితే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఈ ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. రాబోయే లోక్ సభ ఎన్నికలు తమ నేతృత్వంలోనే సాగుతాయని తామిచ్చిన సీట్లతో మిత్రులు సర్దుకోవాల్సి ఉంటుందని బీజేపీ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో కమలనాథుల ఆఫర్‌ను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తిప్పి కొట్టారు.

అన్నాడీఎంకే నేతృత్వంలోనే రాష్ట్రంలో కూటమి ఉంటుందని, తమ ఆధిపత్యం కిందే మిగతా వారు నడుచుకోవాల్సి ఉంటుందని పొత్తుల విషయంలో బీజేపీకి ఇన్ డైరెక్ట్‌గా తన వాదనను పళనిస్వామి చెప్పేశాడు. ఇంత వరకు బాగానే ఉన్న తాజాగా పన్నీర్ సెల్వం శిబిరానికి చెందిన అన్నా డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి వైద్యలింగం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమితో కలిసే లోక్ సభ ఎన్నికలకు అన్నాడీఎంకే ఎదుర్కొంటుందని వైద్యలింగం చేసిన కామెంట్స్ పన్నీరు సెల్వంను ఇరకాటంలో పెట్టినట్టైంది. ఓ వైపు పొత్తుల విషయంలో తమదే తుది నిర్ణయం అని పళని స్వామి వర్గం చెబుతుంటే, పన్నీరు శిబిరానికి చెందిన వైద్యలింగం మాత్రం ఎన్డీఏ కూటమికి జై కొట్టడం ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే, బీజేపీకి రెండు దఫాలుగా పార్లమెంట్‌లో సొంతంగా మెజార్టీ వచ్చినా సౌత్ ఇండియాలో ఆ పార్టీ పూర్ ఫర్మార్మెన్స్ కనపరిచింది. దీంతో ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఇప్పటి నుంచే సౌత్ స్టేట్స్‌పై కమలనాథులు ఫోకస్ పెట్టారు. తెలంగాణలో అధికారం తమదే అన్నట్టుగా టీఆర్ఎస్‌తో బిగ్ ఫైట్ సాగిస్తోంది. కర్ణాటకలో మరోసారి ప్రభుత్వాన్ని నిలుపుకునేలా కసరత్తు ప్రారంభించింది. మరో వైపు తమిళనాడులోనూ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి సీఎం ఎంకే స్టాలిన్‌కు చెక్ పెట్టేలా అన్నాడీఎంకే ద్వారా తిరుగులేని విధంగా అవతరించాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి అన్నాడీఎంకేలోని వర్గపోరు సమస్యగా మారింది.

ఈ నేపథ్యంలో బీజేపీ తలపెట్టిన ఆపరేషన్ సౌత్ ఇండియా సవాలుగా మారింది. అయితే ఏన్డీయేతో కూటమికి పళని స్వామి వర్గం సంశయిస్తుంటే.. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన కీలక నేత మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. త్వరలో చిన్నమ్మ శశికళ సైతం తిరిగి యాక్టివ్ రోల్ పోషించేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా సోమవారం జరిగిన తమిళనాడు మాజీ సీఎం జయలలిత 6వ వర్ధంతి సందర్భంగా వీకే శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే వర్గాలను ఏకం చేయడంపై ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముగియడంతో బీజేపీ పెద్దలు సౌత్ స్టేట్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనేది మరింత ఆసక్తిగా మారింది.


Next Story

Most Viewed