జాతీయ పార్టీ ప్రకటనకు ముందు కేసీఆర్‌కు బీజేపీ భారీ షాక్?

by Disha Web Desk 2 |
జాతీయ పార్టీ ప్రకటనకు ముందు కేసీఆర్‌కు బీజేపీ భారీ షాక్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారు కావడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ ఉప ఎన్నికకు నేటితో సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. జాతీయ పార్టీ ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓ వైపు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో పాటు మరోవైపు మునుగోడుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి సీఎ కేసీఆర్‌కు ఏర్పడింది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ పేరునే సూత్రప్రాయంగా చెబుతునప్పటికీ పలువురు స్థానిక నేతలతో పాటు బూర నర్సయ్య, కర్నే ప్రభాకర్ లాంటి కీలకమైన నేతలు మునుగోడులో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీలకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ తన అభ్యర్థి ఎవరో అనేది ఉత్కంఠ రేపుతున్నది.

కేసీఆర్‌ను బిజీ చేసే ప్లాన్?:

దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు, మంత్రివర్గ సభ్యులతో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడును జాతీయ పార్టీ పేరుతోనే ఎదుర్కొందామని వారితో చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే జాతీయ పార్టీ ప్రకటన కంటే ముందే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడం వెనుక బీజేపీ మాస్టర్ స్కెచ్ వేసిందనే చర్చ తెరపైకి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జాతీయ పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో విస్తృత స్థాయిలో సమాలోచనలు చేయాల్సి ఉంది. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా సీఎం కేసీఆర్‌ను రాష్ట్రంలోనే బిజీ చేసే ప్రణాళికతో ఉందని ఇందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించి రాజీనామా చేయించడం, జాతీయ పార్టీ ప్రకటనకు ముందు అదును చూసి షెడ్యూల్ ఖరారు అయ్యేట్లుగా ప్లాన్ వేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ ఎఫెక్ట్‌తో కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌పై నుండి అభ్యర్థి ఖరారు, ఎన్నికలో గెలుపు వ్యూహంపై ఫోకస్ చేసేలా బీజేపీ గేమ్ ఛేంజ్ చేస్తోందనే ప్రచారం జరుగుతున్నది. మరి బీజేపీ వ్యూహాన్ని కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.

అమిత్ షాతో భేటీ తర్వాత కీలక పరిణామం:

మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు ముందు మూడు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడులో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, వర్తమాన అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో పాటు ఇతర పార్టీల ఎన్నికల వ్యూహాలపై రాజగోపాల్ రెడ్డి అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆపార్టీ తెలంగాణ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ మునుగోడు ఉప ఎన్నికపై పార్టీకి చెందిన కీలక నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుందని పార్టీ నేతలంతా నియోజకవర్గంలోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఆయన చెప్పినట్లుగానే మునుగోడులో నవంబర్ 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో బీజేపీ విజయానికి బన్సల్ వ్యూహరచన సక్సెస్ మంత్రగా నిలిచిన నేపథ్యంలో ఆయన చెప్పినట్లుగానే మునుగోడుకు ఉపఎన్నిక తేదీ వెలువడడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.


Next Story

Most Viewed