కాంగ్రెస్ లేని కూటమిపై అఖిలేష్ యాదవ్ ఫోకస్?

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ లేని కూటమిపై అఖిలేష్ యాదవ్ ఫోకస్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికార పీఠం మీద కూర్చోబెట్టేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చారు. అయితే ఈ యాత్రపై తాజాగా సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 3 నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్న భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ గుండా వెళ్తున్న నేపథ్యంలో ఇందులో పాల్గొనేందుకు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్‌ఎల్‌డీ జయంత్ చౌదరితో సహా పలువురు బీజేపీ యేతర పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ ఇటీవల తెలిపింది. కానీ భారత్ జోడో యాత్ర కోసం మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ గురువారం స్పష్టం చేశారు. అంతే కాదు బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల ఐడియాలజీ ఒక్కటేనని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ సిద్ధాంతాలు వేరు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతం వేరు అన్నారు. తమ పార్టీ నమ్మే మనోభావాలు భారత్ జోడో యాత్రలో ఉన్నప్పటికీ వారి నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు. తాము భారత్ జోడో యాత్రకు మద్దతు ఇస్తున్నామని చెప్పిన అఖిలేష్.. ఇది భవిష్యత్‌లో ఏర్పడబోయే కూటమికి సంబంధించిన ఊహాగానాలకు దారీతీయకూడదని అభిప్రాయపడ్డారు.

అఖిలేశ్ ఫిక్స్ అయ్యారా?:

బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఒక్కటేనని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో అఖిలేశ్ భేటీ కావడం చర్చగా మారింది. ఈ భేటీకి ముందు ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి 2024లోగా 'ప్రత్యామ్నాయం' ఏర్పాటు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయని, ఇందుకోసం కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ లేని కూటమికే అఖిలేశ్ ఫిక్స్ అయ్యారా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక పరమార్థం ఇదేనా అనే చర్చ జరుగుతోంది. అయితే మరో వైపు నితీశ్ కుమార్ మాత్రం ఇతర పార్టీతో మాదిరిగానే కాంగ్రెస్‌తో సమాన మైత్రీ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలేశ్ చేసిన కామెంట్స్‌తో భవిష్యత్‌లో కాంగ్రెస్ లేకుండానే బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడబోతోందా అనేది చర్చగా మారింది.



Next Story

Most Viewed