వివేకా హత్యకేసులో కొత్తకోణం.. లైంగికంగా వేధించినందుకే హత్య..!

by Dishafeatures2 |
వివేకా హత్యకేసులో కొత్తకోణం.. లైంగికంగా వేధించినందుకే హత్య..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకా లైంగికంగా వేధించడం వల్లే హత్య చేశారని వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి తరఫు న్యాయవాది సరికొత్త వాదనలను తెరపైకి తీసుకువచ్చారు. లైంగిక వేధింపుల నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని వాదించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ తల్లిని వైఎస్ వివేకా లైంగికంగా వేధించారని కోర్టుకు తెలియజేశారు.

తల్లిని లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్‌ యాదవ్‌ హత్య చేశారని భాస్కర్‌ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇకపోతే వైఎస్ వివేకా హత్యకేసు తొలి నుంచి ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు వినిపిస్తున్నాయి. తొలుత వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఆరోపించారు. అనంతరం గొడ్డలితో హత్య చేశారని మరో ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఓ సెటిల్‌మెంట్ విషయంలో హత్య జరిగిందని కొందరు ఆరోపించారు. వైఎస్ వివేకాకు రెండో భార్య ఉందని, పేరుకూడా మార్చుకున్నారని, అందువల్లే హత్య జరిగి ఉండొచ్చని కూడా ఆరోపించారు. కానీ ఎంపీ టికెట్ విషయంలో తన తండ్రిని హత్య చేశారని వైఎస్ సునీతారెడ్డి ఆరోపిస్తుంది. ఇన్ని ట్విస్ట్‌ల మధ్య కేసు విచారణ జరుగుతుండగా తాజాగా మరో సంచలన ఆరోపణలు వైఎస్ వివేకాపై రావడం చర్చనీయాంశంగా మారింది.




Next Story

Most Viewed