ఎమ్మెల్సీ ఎలక్షన్.. కన్ఫ్యూజన్ కంటిన్యూ!

by  |
ఎమ్మెల్సీ ఎలక్షన్.. కన్ఫ్యూజన్ కంటిన్యూ!
X

దిశ, నిజామాబాద్ :
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. 12 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగనుండగా.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో పోటీపై స్పష్టతనివ్వలేదు. నామినేషన్ల దాఖలుకు మరో వారం గడువు ఉన్నప్పటికీ పాత నిజామాబాద్ జిల్లాలో ఉప ఎన్నికల కోలాహలం కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సహకార ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆ పార్టీలోని నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. 2016లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున గెలిచిన డాక్టర్ భూపతిరెడ్డి, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరడంతో అనర్హతకు గురయ్యారు. ప్రస్తుతం కోర్టు తీర్పుల తరువాత ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కానీ, కేవలం ఎమ్మెల్సీ కాలపరిమితి 24 నెలలు(2022 వరకు) మాత్రమే ఉండనుంది. ఈ కారణంగానే ఉమ్మడి జిల్లాలోని పెద్ద నాయకులెవరూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

మొన్నటి వరకు ఉమ్మడి జిల్లా నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ సభాపతి కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు రాజ్యసభ సీట్లను ఆశించారు. పెద్దల సభకు వెళ్లడం ద్వారా పెద్దరికంతోపాటు పార్టీలో ప్రతిష్ట పెరుగుతుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాకు రాజ్యసభ సీటు వచ్చేలా కనిపించడం లేదు. పోనీ వీరు శాసనమండలికి వెళ్తారా.. అంటే తమకు ఆసక్తి లేదని చెప్పినట్లు సమాచారం. మిగిలినవారిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజామాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కామారెడ్డి టీఆర్ఎస్ అధ్యక్షుడు ముజిబోద్దిన్, బోధన్‌కు చెందిన అమర్‌నాథ్ బాబు మాత్రమే ఎమ్మెల్సీ పదవిపట్ల ఒకింత ఆసక్తి కనబరుస్తున్నా వారికి టికెట్ కేటాయింపుపై అధిష్టానం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌లు అసలు పోటీలో ఉంటాయా లేదా అనే విషయం పైనా ఆ పార్టీలు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి ఎన్నికకు 724 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికైతే మెజార్టీ ఓటర్లు అధికార పార్టీకి చెందిన వారే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అందరినీ భయపెడుతోంది.

ఉమ్మడి రాష్ర్టంలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి క్రాస్ ఓటింగ్‌తో గెలిచిన రికార్డు ఉంది. అందుకే తక్కువ కాలపరిమితి ఉన్న ఎన్నికలు ఏకగ్రీవం అయితేనే బాగుంటుందనే అభిప్రాయాలను నేతలు వెల్లడిస్తున్నారు. కాస్తో కూస్తో బలం ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలైతే మాత్రం ఎన్నికలు నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే వారిని ఎలా దారిలో తెచ్చుకోవాలని అధికార పార్టీ యోచిస్తోంది. ఆర్థికంగా బలమైన నేతలను బరిలో నిలపాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. దీంతో రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ పూర్తయితేగానీ, అధికార టీఆర్ఎస్.. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. కాగా గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీజేపీ సత్తా చాటిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుందా లేదా అనేది ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇక కాంగ్రెస్ అసలు పోటీలో ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.

tags : Nizamabad, MLC By Election, TRS, BJP, Congress

Next Story