గ్రేటర్‌‌‌లో ఎవరు గ్రేట్..!

by  |
గ్రేటర్‌‌‌లో ఎవరు గ్రేట్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు వచ్చే నెల 4న ఉంటాయని స్పష్టమవుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్‌కు సమాయత్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపునూ ప్రతి రాజకీయ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఎలాగైనా జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు వ్యూహప్రతివ్యూహాలను పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీ సిద్ధాంతాలతోపాటు ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు.. మొదలు అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపు వరకు అన్ని తామై వ్యవహరించాల్సిన మూడు పార్టీల చీఫ్‌లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.

బీజేపీ ఊపు..

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అప్రతిహతంగా ముందుకు సాగుతుండగా, ఒకప్పుడు కళకళలాడిన కాంగ్రెస్ క్రమక్రమంగా పట్టు చేజార్చుకుంటోంది. కమ్యూనిస్టు పార్టీలతోపాటు టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమయంలో రాష్ట్రంలో పాగా వేయడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఆ పార్టీ స్టేట్ చీఫ్‌గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సంజయ్ నాయకత్వంలో విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు అదే ఊపును జీహెచ్ఎసీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. సంజయ్ ఇప్పటికే గ్రేటర్‌లో అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచారం కొనసాగించే పనిలో నిమగ్నమయ్యారు.

ఎవరి ప్రభావం ఎంతనో..

తెలంగాణ ఉద్యమం వరకు రాష్ట్రంలో ఆధిపత్యం కొనసాగించిన టీడీపీ ఆ తర్వాత తన ఉనికిని కోల్పోయింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని రాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. టీఆర్ఎస్ ఎత్తులతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా తయారైంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఎల్.రమణ రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల మరోసారి బాధ్యతలు చేపట్టారు. మహానగరంలో టీడీపీకీ అభ్యర్థులను రంగంలోకి దింపి టీడీపీ బలం ఏంటో చూపించే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఇక రాష్ట్రంలో ఏనాడూ బలంగా లేనప్పటికీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన చరిత్ర వామపక్షాలకు ఉంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చాడ వెంకటరెడ్డి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందినవారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌లో పాగా వేసి సత్తా చాటేవిధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మూడు పార్టీల చీఫ్‌లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడంతో ఈసారి ఎవరి ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న చర్చ జిల్లాలో సాగుతోంది. ముగ్గురు బాధ్యుల్లో ఎవరు గ్రేటర్‌లో గ్రేట్ అనిపించుకుంటారో తెలియాలంటే ఎన్నికలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

వంద స్థానాల్లో గెలుపే లక్ష్యం : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

గ్రేటర్‌లో వంద స్థానాల్లో గెలవడమే లక్ష్యం. దుబ్బాక విజయంతో కార్యకర్తలు నూతనేత్తేజంతో ఉన్నారు. రాష్ట్రసర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని తీరుతాం. భాగ్యనగర్ ప్రజలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

కసరత్తు చేస్తున్నాం : టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ

జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నాం. పార్టీ శ్రేణులు సమాయత్తంగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక ఆయా డివిజన్ల కమిటీలదే. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడతాం. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిన టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు.

ఇతర పార్టీలు కలిసి వస్తే పొత్తు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

ఇప్పటికే వామపక్షాల సమావేశం జరుపుకున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. మాతో ఇతర పార్టీలు కలిసి వస్తే పొత్తు కుదుర్చుకుంటాం. లేనట్లయితే వామపక్ష పార్టీల తరఫున సంయుక్తంగా అభ్యర్థులను బరిలో దించుతాం.

Next Story

Most Viewed