పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పొలిటికల్‌ వైపు?

by  |
పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పొలిటికల్‌ వైపు?
X

దిశ, హైదరాబాద్ : ‘భద్రత మాదే.. బాధ్యత మాదే’ అంటూ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత్తంగా ప్రచారం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా, స్నేహాపూర్వక వాతావరణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ స్లోగన్ ఉద్దేశ్యం. అయితే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్‌‌గా ఉండాల్సిన రాష్ట్ర పోలీసులు రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్నట్టు, పరిధిలు దాటి ప్రవర్తిస్తున్నట్టు ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అధికారపార్టీ కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్’ నినాదం కాస్తా ‘పొలిటికల్ ఫ్రెండ్లీ’‌గా మారిందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా వీటిపై పోలీస్ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

రాష్ట్రంలో గత ఆరేళ్లుగా ఎలాంటి అల్లర్లు, శాంతి భద్రతలకు ఆటంకాలు చోటు చేసుకోలేదని పోలీసులు పదే పదే చెబుతున్నారు. ప్రతి అంశంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, నేరాలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని వారి మాటల్లోని సారాంశం. హైదరాబాద్ నగరంలో 5 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని రెట్టింపు చేయబోతున్నామని కూడా ఇటీవల పోలీస్ అధికారులు ప్రకటించారు.

ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ16వ స్థానంలో ఉందని, దేశ వ్యాప్తంగా అత్యంత మెరుగైన పోలీస్ స్టేషన్ల టాప్ టెన్ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి వరుసగా స్థానం లభించిందని, అనేక అవార్డులు వచ్చాయని చెబుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా ఇటీవల పోలీస్ శాఖపై వస్తున్న ఆరోపణలు, విమర్శల సంగతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ శాఖ చెబుతున్న పీపుల్స్ ఫ్రెండ్లీ పాలసీకి అనుగుణంగానే రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగానే ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అండగా ఉంటున్నారని, పరోక్షంగా మద్దతు అందిస్తున్నారని నేరుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

గెలుపు పోలీసులకే అంకితమంటూ..

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ వాహనాలను తనిఖీలు చేయకుండా, వారి ఇండ్లళ్లలో సోదాలు చేయకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఇండ్లు, వాహనాలను మాత్రమే తనిఖీలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. అనంతరం ఫలితాలు వచ్చాకా.. ‘నా గెలుపును సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌కు అంకితం చేస్తున్నాను‘ అని గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రకటించారు. ఇదే తరహాలో.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలను గెలుపొందిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ‘ఈ గెలుపును డీజీపీకి అంకితం చేస్తున్నాం’ అంటూ వ్యంగ్యస్త్రాలను విసిరారు. అయితే సిద్దిపేట సీపీ కానీ, డీజీపీ కానీ, పోలీసు అధికారుల సంఘం కానీ ఈ విమర్శలను ఖండించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పోలీసులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిజమేనని చాలా మంది భావిస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed