ఖానాపూర్ టికెట్‌ రాథోడ్‌కి ఇస్తే.. వారి పరిస్థితి..?

by  |
ఖానాపూర్ టికెట్‌ రాథోడ్‌కి ఇస్తే.. వారి పరిస్థితి..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఒకవైపు భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతుండగా.. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ రమేష్ బీజేపీలో చేరికతో సరికొత్త సమీకరణం మొదలైంది. ఆయన ఆదిలాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తారా.. ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా.. అనే చర్చ సాగుతోంది. ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని సోయం బాపురావు ఇస్తారా.. లేక తానే పోటీ చేస్తారా.. అనేది తేలాల్సి ఉంది. ఖానాపూర్ అసెంబ్లీకి పోటీ చేయాలనుకు౦టే.. ఇప్పటికే పాతవారు అవకాశం కోసం వేచి చూస్తుండగా వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణం మొదలైంది. భారతీయ జనతా పార్టీలోకి పెద్దపెద్ద నాయకులు చేరుతుండగా వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్‌ పర్సన్ అప్పాల గణేష్ చక్రవర్తి, పెంబి జెడ్పీటీసీ సభ్యురాలు జానుబాయి, సిర్పూర్ కాగజ్‌ నగర్‌లో పాల్వాయి హరీష్ బాబు బీజేపీలో చేరారు. తాజాగా మాజీ ఎంపీ ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ రాథోడ్ రమేష్ కమలం గూటికి చేరారు. ఆయన కాషాయ కండువా కప్పుకోవడంతో బీజేపీతో పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేసింది.

ఆదిలాబాద్ ఎంపీ స్థానం ఎస్టీ రిజర్వు కాగా.. ఆయన 2009లో ఎంపీగా కూడా గెలిచారు. 2014, 2019 లలో పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలువగా.. ఆయన 2018లో ఓడిపోయారు. తాజాగా ఆయన బీజేపీలో చేరగా ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా.. ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా.. అనే విషయంపై చర్చ మొదలైంది. బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ పొందారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఎంపీనా.. ఎమ్మెల్యేగానా పోటీ..

వాస్తవానికి ఆయనకు గతంలో రెండుసార్లు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినా ఆయన వెళ్లలేదు. గత ఎన్నికల్లో ఆయన వెళ్లకపోవడంతో సోయం బాపురావు బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తాజాగా ఆయన ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారా.. ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతారా.. ఈ విషయంపై అధిష్టానం ఎలాంటి స్పష్టత ఇచ్చిందనేది చర్చ జరుగుతోంది.

ఖానాపూర్ నియోజకవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ ఉండగా పక్కనే ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనూ కొంత క్యాడర్ ఉంది. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో గిరిజనుల ఓట్లు ఎక్కువగా ఉండగా.. గిరిజనులు బలమైన నాయకుడుగా రాథోడ్ రమేష్ పేరు పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంపీగా పోటీలో ఉంటారా.. అసెంబ్లీ బరిలో నిలుస్తారా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బిజెపికి సిట్టింగ్ సీట్‌గా ఉంది. 2019లో సోయం బాపురావు బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల రాథోడ్ రమేష్ బిజెపిలో చేరేందుకు రాష్ట్ర కేంద్ర నాయకత్వంతో చర్చలు జరపగా.. సోయం బాపురావు అడ్డుకున్నారు. దీంతో ఆయనను కలిశాకే తాజాగా రాథోడ్ రమేష్ బీజేపీలోకి చేరారు. సోయం బాపురావు వచ్చే ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని పట్టుదలతో ఆయన ఉన్నట్లుగా ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. అందుకే రాథోడ్ రమేశ్ చేరికను ఆయన అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఖానాపూర్ నియోజకవర్గంలో పెంబి జెడ్పీటీసీ సభ్యురాలును బీజేపీలో చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే హామీతో చేర్చుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

తాజాగా రాథోడ్ రమేష్ చేరగా ఆయనకు ఎంపీ స్థానం కాకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళనలో ఆమె ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆమె ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడగా.. టిక్కెట్ల ప్రస్తావన ఇప్పుడు అవసరం లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఎవరికి టిక్కెట్ల విషయంలో హామీ ఇవ్వలేదని అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. బాగా పనిచేసిన వారికి టిక్కెట్లు వస్తాయని.. మీ పని మీరు చేసుకోవాలని పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. సోయం బాపురావు బోథ్ నియోజకవర్గంలో ఎక్కువ దృష్టి పెడుతున్నారని.. ఆయన బోథ్ ఎమ్మెల్యే బరిలో ఉంటారనే చర్చ మరొకటి ఉంది. ఇదే జరిగితే రాథోడ్ రమేశ్ ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా రాథోడ్ రమేష్ ఎంపీగా పోటీకి వెళ్తారా ఎమ్మెల్యే బరిలో ఉంటారా.. అనేది సరికొత్త సమీకరణానికి తెరలేపింది.

Next Story