సకాలంలో గర్భిణిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

by  |

దిశ, మేడ్చల్: ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న గర్భిణిని పోలీసులు సకాలంలో తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పోలీసులే ఆపద్బాంధవులు అవుతున్నారు. సహాయం కోసం 100కు ఫోన్ చేస్తే చాలు.. చిటికెలో వచ్చి సహకారం అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్​లోని వాజ్​పేయ్‎నగర్​కు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు అంబులెన్స్​కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి రావడం ఆలస్యమవుతుందని అంబులెన్స్ సిబ్బంది సమాధానమివ్వడం వల్ల వెంటనే 100కు ఫోన్ చేశారు. సకాలంలో స్పందించిన పేట్ బషీరాబాద్ పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో గర్భిణిని కుత్బుల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం అంబులెన్స్​లో ఆదిలక్ష్మిని కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ఫోన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

tag: police, pregnant woman, hospital, timely manner, Petbasheerabad

Next Story