హత్య కేసును ఛేదించిన పోలీసులు…

9

దిశ, నారాయణఖేడ్:
వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం… కంగ్టి మండలంలోని బాబుల్గాం పంచాయతీ పరిధిలోని హాట్యా తండాలో తులసి బాయి(60) పెన్షన్ డబ్బులతో జీవనం సాగించేది. ఆమెకు ఆరుగురు కుమారులు ఉన్నారు. కిషన్ నాయక్ అనే కుమారుడు వద్ద తులసి బాయి ఉండేది. ఈ క్రమంలో కిషన్ నాయక్ భార్యతో తులసి బాయికి తరచు గొడవలు జరుగుతుండేవి. కాగా తులసీబాయి వద్ద 50 తులాల వెండి , డబ్బులు ఉండడంతో తల్లిని ఎలాగైనా చంపాలని కిషన్ నాయక్ పక్కా స్కెచ్ వేశాడు.ఏడాది క్రితం తులసి బాయి కుమారుడైన కిషన్, మనుమడైన పుండ్లీక్, మరో వ్యక్తి కిషన్ బావమరిది అయిన లచ్చిరాంతో కలిసి వృద్దురాలిని హత్య చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా తామే హత్య చేసినట్లు నిందితులు ముగ్గురు ఒప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రఫీక్ లు వివరించారు.