మూడు దుంగలు.. ఆరు ట్రిప్పులుగా కలప అక్రమ రవాణా.. స్మగర్ల హల్‌చల్

by  |
మూడు దుంగలు.. ఆరు ట్రిప్పులుగా కలప అక్రమ రవాణా.. స్మగర్ల హల్‌చల్
X

దిశ, భద్రాచలం : అక్రమ కలప రవాణా గుట్టురట్టు అయింది. అర్థరాత్రి వేళ అడవి నుంచి అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న కారును గస్తీలో ఉన్న చర్ల సీఆర్‌పీఎఫ్, గ్రేహాండ్స్ పోలీసులు పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో అటవీ సిబ్బంది కేసు నమోదు చేయక తప్పలేదు. ఇలా అక్రమంగా రవాణా అవుతున్న కలపను చర్ల పోలీసులు పట్టుకోవడం ఇది రెండోసారి.

అయితే.. అటవీ సిబ్బంది సహకారంతోనే కలప అక్రమ రవాణా జరుగుతోందా.? లేక అటవీ ఉద్యోగుల కన్నుగప్పి స్మగ్లర్లు రవాణా చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు తెలంగాణలోకి వైద్యం కోసం వచ్చే అవకాశం ఉన్నట్టు నిఘావర్గాల సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

దీంతో మావోయిస్టు ప్రభావిత లెనిన్‌ కాలనీ శివారు అటవీ ప్రాంతం మార్గంలో గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఫారెస్ట్ నుంచి చర్ల వైపు వస్తున్న ఏపీ 10 పి 2437 నంబర్ మారుతీ 800 కారును ఆపి సోదా చేయగా అందులో టేకు దుంగలు ఉన్నాయి. పోలీసులు ఆరా తీయగా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుసుకొని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ సిబ్బంది వెళ్ళి కలప దుంగలతో ఉన్న కారుని స్వాధీనం చేసుకొని చర్ల అటవీ కార్యాలయానికి తరలించారు. కారులో 250 సెంటీమీటర్ల మూడు దుంగలు ఉన్నాయని, వాటి విలువ సుమారు 32 వేలు అని చర్ల ఎఫ్‌బీవో సూర్యనారాయణ తెలిపారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి కారు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కలప ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం టేకులేరు నుంచి పట్టుకొచ్చి తాలిపేరు వాగుదాటించి ఉంజుపల్లి దగ్గర కారులో వేసుకొని పట్టుకొస్తుండగా పోలీసులకు చిక్కినట్లు ఎఫ్‌బీవో తెలిపారు. సోమవారం రాత్రి అటవీ సిబ్బంది సుబ్బంపేట గోదావరి దగ్గర మూడు కలప దుంగలు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఆ కలప మంగళవారం మధ్యాహ్నం వరకు ఆఫీసుకి చేర్చలేదు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలపను స్వాధీనం చేసుకున్నా మీడియాకు వివరాలు చెప్పకుండా గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చర్ల అటవీ ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కలప పేరుతో అక్రమంగా రవాణా అవుతున్నట్టు సమాచారం. అయితే పోలీసులకు చిక్కే కలపను, స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు ఎందుకు పట్టుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. కలప స్మగ్లర్లతో కొందరు అటవీ సిబ్బంది కుమ్మక్కై అడవిని నాశనం చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. సిబ్బందిని అధికారులు వెనుకేసుకొని రావడం వల్లనే కలప అక్రమ రవాణా మూడు దుంగలు.. ఆరు ట్రిప్పులు అన్నట్లుగా సాగుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు అవినీతి సిబ్బందిని బదిలీ చేస్తేనే అక్రమ కలప రవాణాకి అడ్డుకట్ట పడుతుందని చర్ల మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


Next Story