హ్యాట్సాఫ్ పోలీస్.. ప్రాణం నిలిపిన ఖాకీలు

by  |
Valigonda
X

దిశ, భువనగిరి రూరల్ : పోలీసుల సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన వ్యక్తిని వలిగొండ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ప్రాణాలు నిలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొల్లూరి మల్లయ్య వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెంది మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత రైలు కింది పడి ఆత్మహత్య చేసుకునేందుకు వలిగొండ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు.

అయితే కొల్లూరి మల్లయ్య ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డయల్ 100 నంబర్‌కు సమాచారం అందడంతో ఎస్ఐ అప్రమత్తమయ్యారు. వెంటనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు జి.మనోజ్ కుమార్, యం.ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు సమాచారం అందించారు. క్షణాల్లోనే స్పందించిన కానిస్టేబుళ్లు మెరుపు వేగంతో రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి కొల్లూరి మల్లయ్యను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం ఆయనకు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Police

కాగా, సమాచారం అందిన వెంటనే స్పందించిన ఎస్ఐని మండల ప్రజలు అభినందిస్తున్నారు. కానిస్టేబుళ్లు ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా.. ప్రాణాలు దక్కేవి కాదని మల్లయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆపద సమయంలో సకాలంలో స్పందించి ఆత్మహత్యను నివారించిన పోలీసులను ప్రజలు, నాయకులు ప్రశంసిస్తున్నారు.



Next Story

Most Viewed