పోలీసుల కళ్లుగప్పి జోరుగా కోళ్ల పందేలు.. ఎస్పీ సడన్ ఎంట్రీ..( వీడియో)

299
hen

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పోలీసుల కళ్లుగప్పి ఆంధ్ర- తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నది తీర ప్రాంతంలో గత రెండు రోజులుగా కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేయడం, విస్తృత ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఈ హెచ్చరికలు తమకు కావు అన్నట్లుగా భావించిన పందెం రాయుళ్లు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షేక్ పల్లి, సాసనమూలు గ్రామాల శివారులో ఉన్న రహస్య ప్రదేశంలో కోడి పందాలను నిర్వహించారు.

శుక్రవారం ఎటువంటి ఆటంకాలు లేకుండా పోటీలు జరగడంతో పందెం రాయుళ్లు శనివారం ఇంకా పెద్ద మొత్తంలో తరలివచ్చి పోటీలలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న పందెం రాయుళ్లు అక్కడి నుండి పరుగులు పెట్టారు.

వేలాది సంఖ్యలో ఉన్న పందెంరాయుళ్లలో కొంతమందిని అదుపులోకి తీసుకొన్నారు. 100 మోటార్ సైకిళ్ళు, 100 కు పైగా కోడి పుంజులు, భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని కోదండాపురం పోలీస్ స్టేషన్ ‌కు తరలించినట్లు సమాచారం. కాగా ఈ తతంగం నిర్వహించడంలో స్థానిక అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మరోవైపు స్థానిక పోలీసులతో కాకుండా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేయడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.