- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బెజవాడ ఊపిరిపీల్చుకో.. పోలీసుల అదుపులో కీలక నిందితులు..

దిశ, ఏపీ బ్యూరో: చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే ప్రజలు భయంతో హడలిపోతారు. ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగతనం చేసే స్టైలే వేరు. అంతా పక్కాగా స్కెచ్ వేస్తారు. ఆ స్కెచ్ ప్రకారం దోపిడీ చేసి ఆ సొమ్ముతో సొంతూరుకు వెళ్లిపోతారు. దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా అడ్డొచ్చినా.. పట్టుకోవాలని ప్రయత్నించినా ఖతం చేసేస్తారు. అంతేకాదు దొంగతనం చేసిన తర్వాత ఆ ముఠాలో ఎవరైనా సభ్యుడు దొరికిపోతే మిగిలిన వారి పేర్లు బయటపెట్టరు. వీరు దొంగతనం చేసే ప్రాంతంపై రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాతే దోపిడీ చేస్తారు. దోపిడీ చేసేది కూడా అర్థరాత్రి లేదా తెల్లవారు జామున 2-3గంటల ప్రాంతంలో చేస్తారు. దోపిడీకి వెళ్లేటప్పుడు ఈ చెడ్డీ గ్యాంగ్ వస్త్రధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. శరీరం అంతా ఆయిల్ పూసుకుంటారు. ఒంటిమీద ఒక చెడ్డీ తప్ప ఇంకేమీఉండదు. పదునైన కత్తులు, ఇనుపరాడ్స్‌తో దోపిడీకి వెళ్తారు. దోపిడీ చేస్తున్నప్పుడు సైలెంట్‌గా ఉంటే ఏమీ చేయరు. ఒకవేళ ఎదురు తిరిగితే మాత్రం చంపేవరకు ఊరుకోరు. ఇదీ చెడ్డీ గ్యాంగ్ చోరీ విధానం. అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ విజయవాడలో ఎంటరైంది. తొలుత కుంచనపల్లి, తాడేపల్లిలో ప్రవేశించి ఆ తర్వాత శివారు గ్రామాల్లో దోపిడీలకు పాల్పడింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనాలకు పాల్పడుతుంది చెడ్డీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ టాటా ఎట్టకేలకు ఈ టీంలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ప్రజలు హమ్మయా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
కంటిమీద కునుకులేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్..
గత కొన్ని రోజులుగా విజయవాడ ప్రజలకు, అటు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ పలు దొంగతనాలకు పాల్పడుతుంది. గుజరాత్ నుంచి విజయవాడ వచ్చి ఈ చెడ్డీ గ్యాంగ్ నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఎప్పుడు ఏ రూపంలో చెడ్డీ గ్యాంగ్ దాడి చేస్తుందన్న టెన్షన్‌తో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ కాంతిరాణా టాటా సాంకేతిక ఆధారాలతో చెడ్డీ గ్యాంగ్ వివరాలను సేకరించారు. దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. ఇటీవలకాలంలో నగర శివారు ప్రాంతాలలో జరిగిన దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ కాంతి రాణా టాటా దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులు, జైలు నుండి విడుదలైన నేరస్థులు మరియు అనుమానాస్పద వ్యక్తులు మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ మరియు పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలాలకి చేరుకొని నేరం జరిగిన తీరు, క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన ఆధారాలు మరియు సీసీ కెమెరాల ఆధారంగా అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తూ ముద్దాయిల గురించి గాలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు టూటౌన్ ఇన్ స్పెక్టర్ మోహన్ రెడ్డి, పెనమలూరు ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ మరియు సీసీఎస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 3 కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మడియా కాంజీ మేడా, సక్ర మండోడ్, కమలేష్ బాబేరియాలను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురులో మడియా కాంజీ మేడా, సక్ర మండోడ్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. కమలేష్ బాబేరియా మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడుగా సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు.
నేరం ఎలా చేసేవారంటే..
దొంగతనాలకు పాల్పడే వారు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. వీరు నేరానికి వచ్చేటప్పుడు నిక్కరు ధరిస్తారు కాబట్టి వీరిని చెడ్డీ గ్యాంగ్ అని పిలుస్తారు. వీరు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. కూలి పనులు లేని సమయంలో డబ్బుల కోసం రైళ్ళలో ప్రయాణ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నగర శివారు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండే ఇళ్ళు, అపార్ట్ మెంట్‌లను పగటిపూట రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగులకొట్టి ఇళ్ళల్లో ఉన్న నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను దొంగిలించుకొని వెళ్లిపోతారు. గత నవంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రం నుండి రైలులో బయలుదేరి విజయవాడ నగర శివారులోని మిల్క్ ప్రాజెక్టు వద్ద గల ఫ్లైవోవర్ బ్రిడ్జి పక్కన ఉన్న అపార్ట్ మెంట్‌ను గమనించారు. ఈనెల 28(తెల్లవారితే 29)న తెల్లవారు జామున 2గంటల సమయంలో మడియా మరో నలుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌లోకి వెనుకనుంచి వెళ్లారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ను మారణాయుధాలతో బెదిరించి ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని బంగారు వస్తువులు, డబ్బులను దోచుకెళ్లారు. ఆ తర్వాత డిసెంబర్ 1న ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌ను గమనించి రాత్రి 7 గంటల సమయంలో రెక్కీ నిర్వహించారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా ఆ ఇంటిలోని వారు.. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారు.
మరుసటి రోజు తాడేపల్లి రైన్ బో విల్లాస్‌లో దొంగతనం చేశారు. అయితే అక్కడ ఎలాంటి బంగారం ఆభరణాలు గాని, నగదు గాని దొరకకపోవడంతో వెళ్లిపోయారు. అదేరోజు తెల్లవారు జామున 4గంటలకు కుంచనపల్లి గ్రామంలో ఒక అపార్ట్ మెంట్‌లో తాళాలు పగులగొట్టి నగదు మరియు ఇతర ఆభరణాలు దోచుకెళ్లినట్లు సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు. అలాగే డిసెంబర్ 6న నిడమానూరు వైపు వెళ్లే రోడ్డులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ చోరీకి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయవాడ నగరంలోని టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సీపీ టాటా ఆధ్వర్యంలో సీసీఎస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని నేరం జరిగిన తీరు, క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన సైంటిఫిక్ గా సేకరించిన ఆధారాలు మరియు సి.సి. కెమెరాల ఆధారాంగా అన్ని కోణాలలో దర్యాప్తు చేశారు. అనంతరం రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల సమాచారం రావడంతో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి రూ. 20,000/-లు నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. అయితే రెండు గ్యాంగులుగా దోపిడీలకు పాల్పడుతున్నారని మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ కేసులో సహకరించిన అందరికీ సీపీ కాంతి రాణా టాటా అభినందనలు తెలిపారు.